గుజరాత్ నుండి ఢిల్లీ దాకా.. ప్రధాని మోడీ రికార్డుపై లోకేష్ ప్రశంసల జల్లు

by Gantepaka Srikanth |

భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

గుజరాత్ నుండి ఢిల్లీ దాకా.. ప్రధాని మోడీ రికార్డుపై లోకేష్ ప్రశంసల జల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. దేశంలో అత్యధిక కాలం ఒక ప్రభుత్వానికి అధిపతిగా (Head of Government) పనిచేసిన వ్యక్తిగా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. నేటితో (మార్చి 22, 2026) ఆయన పదవీకాలం 8,931 రోజులకు చేరింది. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజులు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. తాజాగా మోడీ ఆ రికార్డును అధిగమించి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సుదీర్ఘకాలం అధికార పీఠంపై ఉన్న నేతగా నిలిచారు. నరేంద్ర మోడీ ప్రస్థానం అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైంది. గుజరాత్ సీఎంగా 2001 నుండి 2014 వరకు.. సుమారు 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం భారత ప్రధానిగా 2014 మే 26 నుండి ప్రస్తుతం కొనసాగుతున్నారు. వరుసగా మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు, ముఖ్యమంత్రిగా మరియు ప్రధానమంత్రిగా దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా ప్రజలకు సేవ చేయడం ఒక విశేషం.

లోకేష్ అభినందనలు..

ప్రధాని మోడీ సాధించిన ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. "ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం కోట్లాది మంది భారతీయులకు గొప్ప స్ఫూర్తి. ఆయన సుదీర్ఘ పాలనలో దేశం సాధించిన అభివృద్ధి మరువలేనిది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ఆయన ప్రస్థానం, నేడు భారత ప్రధానిగా ప్రపంచ వేదికపై దేశ గౌరవాన్ని పెంచింది. జాతి నిర్మాణంలో మోదీ నాయకత్వం ఒక చారిత్రక అధ్యాయంగా నిలిచిపోతుంది." అని లోకేష్ పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మరియు ఎన్డీయే మిత్రపక్షాలు ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

Next Story