‘ఏ విపత్తైనా ఎదుర్కొనేందుకు సిద్ధం’.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ఏ విపత్తైనా ఎదుర్కొనేందుకు సిద్ధం’.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయకత్వంలో మరింత సమర్థవంతంగా విపత్తులను ఎదుర్కొనే దిశగా కూటమి ప్రభుత్వం(AP Government) అడుగులు వేస్తోందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఏపీ రక్షణ కోసం బీజం వేసిన సీఎం చంద్రబాబు ఆకాంక్ష రేపటితో నెరవేరనుందని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేతులమీదుగా కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో NDRF, NIDM ప్రాంగణాలను ఆదివారం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత చర్యలు చేపట్టింది. అన్ని శాఖల సమన్వయంతో బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం దిశగా ఎలాంటి చొరవ చూపలేదు. పదే పదే కేంద్రం వైసీపీ ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రహదారులను అభివృద్ధి చేసింది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా నిర్మించిన నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (NDRF), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) ప్రాంగణాలు అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమయ్యాయి. దాదాపు 1000 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొని, సకాలంలో సహాయ చర్యలు చేపట్టడానికి, ప్రజల ప్రాణాలు నిలబెట్టడమే లక్ష్యంగా ఇవి పని చేయనున్నాయి. విపత్తుకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, ఆధునిక సాంకేతికతతో అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి. 2017 జనవరి 9న కొండపావులూరులో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్డీఆర్ఎఫ్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు.

50 ఎకరాల్లో ఏర్పాటైన ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ పరిధిలోకి ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక వస్తాయి. ఈ బెటాలియన్ ఏర్పాటైన నాటి నుంచి 846 సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో 754 ఆపరేషన్లు చేపట్టింది. దేశంలో విపత్తు నిర్వహణలో శిక్షణ, పరిశోధనలకు ఢిల్లీలో ఎన్ఐడీఎం ఏర్పడింది. 2014లో ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చిన కేంద్రాన్ని అప్పటి కేంద్రం ఏపీకి కేటాయించడం జరిగింది. దీంతో ఢిల్లీ తర్వాత రెండో కేంద్రం ఏర్పాటైంది. ఏపీలోనే కావడం ప్రత్యేకం. కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ కు ఎదురుగా 10 ఎకరాల స్థలం ఎన్ఐడీఎం కోసం కేటాయించి..2018 మేలో నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.37 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాలకు సేవలందించనుంది. యంత్రాంగాలను అన్ని విధాల సన్నద్ధం చేసి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా చూడడమే ఎన్ఐడీఎం బాధ్యత. విపత్తు నిర్వహణలకు సంబంధించి శిక్షణే ఇక్కడ ప్రధానమైనప్పటికీ పరిశోధనలు కూడా జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed