- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్న రావణ్ అరెస్ట్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ‘ప్రశ్న రావణ్’, కేవీఆర్‌ల అరెస్టును ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ‘ప్రశ్న రావణ్’, కేవీఆర్‌ల అరెస్టును ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికే విఘాతమని, ఇది ఫాసిజం, పిరికితనం అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన మండిపడ్డారు. ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమా? మన పూర్వీకులు ఇలా గొంతులు నొక్కేసి ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యం మిగిలేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
బాధ్యత ప్రభుత్వానిదే కానీ...
ఏ రాష్ట్రంలోనైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ, ఇలా అరెస్టులు చేయడం దారుణమన్నారు. ‘మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారో.. వారి జబ్బు మీకు కూడా అంటుకున్నట్లుంది’ అంటూ పరోక్షంగా కేంద్రంలోని మిత్రపక్షాన్ని ఉద్దేశించి సెటైర్లు వేశారు.
ప్రశ్న రావణ్ అరెస్ట్
ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల సభలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మంగళవారం రాత్రి పిఠాపురం పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద పలు సెక్షన్లు నమోదు చేశారు.
జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్
మంత్రి నారా లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు హైదరాబాద్‌లో కేవీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, సివిల్ డ్రెస్‌లో వచ్చి ఏపీ పోలీసులు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య సరూర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రశ్న రావణ్‌తో పాటు ఏలూరు సభలో పాల్గొని.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ లాయర్ జడ శ్రవణ్ కుమార్‌పై పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పీఎస్‌లో కేసు నమోదైంది. కాగా, ఈ అరెస్ట్‌లు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది.






