మళ్లీ టీడీపీ పుంజుకోవడానికి CM Jagan బంధువులే కారణం..!

by Disha Web Desk 16 |
మళ్లీ టీడీపీ పుంజుకోవడానికి CM Jagan బంధువులే కారణం..!
X

దిశ, దక్షిణ కోస్తా: మూడు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. జిల్లాలో ప్రకాశాన్ని తీసేసిన నేతల గురించి ఎవరూ మాట్లాడలేదు. సీఎం జగన్​బంధువులు బావ, బామ్మర్దుల వల్లే జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో నిల్చిపోయింది. సీఎం జగన్​దగ్గర సొంత జిల్లా గురించి ఏనాడైనా ప్రస్తావించారా!. ఇది కావాలని ఎన్నడయినా నోరు విప్పారా!. ఎన్నాళ్లు జనాన్ని మభ్యపెడతారు? తరిచ్చిన హామీలనే నెరవేర్చకుంటే మళ్లీ మీకెందుకు ఓట్లెయ్యాలంటూ జిల్లా ప్రజల్లో ఆవేదన నెలకొంది. అందుకే ఇక్కడ మళ్లీ టీడీపీ పుంజుకోవడానికి సీఎం జగన్​ బంధువులే కారణం కావడం విశేషం. జిల్లాలో ఏ నోట విన్నా ఇదే వినిపిస్తోంది. ఇంతకీ వీళ్లిచ్చిన హామీలేంటీ.. నెరవేర్చింది ఏమిటనేది ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు.

ప్రకాశం జిల్లాలో మూడొంతుల భూభాగం పశ్చిమ ప్రాంతంలో ఉంది. వెలుగొండ ప్రాజెక్టుతో సస్యశ్యామలం అవుతుందని అధికార ప్రతిపక్షాలు హామీలిచ్చాయి. వాస్తవానికి వెలుగొండ ప్రాజెక్టుకు 1998లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దివంగత నేత వైఎస్​రాజశేఖర్​రెడ్డి హయాంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్లారు. దాదాపు 60 శాతం పనులు ఆయన హయాంలోనే జరిగాయి. తర్వాత టీడీపీ వచ్చాక పనులు మందగించాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి రెండు సొరంగాల ద్వారా నల్లమల రిజర్వాయర్‌కు నీటిని తరలించాలి. మొత్తం 43 టీఎంసీల నీటితో ప్రకాశంతోపాటు నెల్లూరు, కడప జిల్లాల్లో కొంత భాగానికి తాగునీటితోపాటు సాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టును అలసత్వం చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి ఏకంగా నిరసన, పాదయాత్ర చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే ఏడాదిలో పూర్తి చేస్తామని బల్లగుద్ది చెప్పారు. ఇప్పటికీ వెలుగొండ ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొచ్చిన దాఖలాల్లేవు.


ఇదే కాదు. కేంద్ర సర్కారు రామాయపట్నం భారీ పోర్టును నిర్మించాలని, విభజన హామీలు నెరవేర్చాలని వైవీ సుబ్బారెడ్డి వీధి పోరాటాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్​వద్ద చాలా నిరసనల్లో పాలుపంచుకున్నారు. చివరకు కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినా నోరు మెదపలేదు. రామాయపట్నంలో జగన్​తాబేదారుతో మినీ పోర్టు నిర్మాణానికి సిద్ధమయ్యారు. దానికి అనుసంధానంగా కావలి ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతున్నా స్పందించిన దాఖలాల్లేవు. పామూరు ప్రాంతంలో జాతీయ వస్తుత్పత్తి మండలిని (నిమ్జ్​) వైఎస్​హయాంలోనే కేంద్రం మంజూరు చేసింది. దీని ద్వారా లక్షల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు ఆకాంక్షించారు. టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ఎప్పుడు సాకారం చేస్తారని నిలదీసిన వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడెందుకు మౌనం వహించారనేది జనానికి అంతుబట్టడం లేదు. ఇంకా సీఎం జగన్​జిల్లాకు ఇచ్చిన హామీలు బోలెడున్నాయి. చీమకుర్తి ప్రాంతంలో మైనింగ్ యూనివర్శిటీ అన్నారు. జిల్లాలో వెటర్నరీ విశ్వ విద్యాలయం నెలకొల్పుతామన్నారు. ఏ ఒక్కటీ సాకారం లేదు.

ఇక సుబ్బారెడ్డి బావ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు. ఆయన వైఎస్​ హయాంలో భూగర్భ గనుల శాఖ మంత్రిగా చేశారు. జగన్​ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు విద్యుత్, అటవీశాఖల మంత్రిగా కొనసాగారు. జిల్లాకు సంబంధించి చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క అభివృద్ధి జరిగిన దాఖలాల్లేవు. కేంద్రం ఇచ్చిన హామీలను సాధించలేకపోయారు. చివరకు సీఎం జగన్​ ఇచ్చిన హామీలకు దిక్కులేదు. ఒంగోలులో సుమారు పాతిక వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మైనింగ్​భూములను ఎంపిక చేశారు. రాష్ట్రమంతా జగనన్న కాలనీల నిర్మాణం సాగుతుంటే ఇక్కడ ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కలెక్టరు నుంచి రెవెన్యూ సిబ్బంది మొత్తం చాలా విధాలుగా పరిశీలించి పేదల గృహ నిర్మాణానికి మైనింగ్​భూములు కేటాయించడం విచిత్రంగా ఉంది. ప్రతిపక్షం కోర్టుకు వెళ్తే న్యాయ స్థానం ఇక్కడ స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని తేల్చింది. దీన్ని ఇంతకన్నా గుడ్డి ప్రభుత్వం అనకుండా ఎలా ఉండాలని జనం ప్రశ్నిస్తున్నారు.

బాలినేని కుటుంబం రియల్​ఎస్టేట్​వ్యాపారం చేసుకునేందుకు భూములు సిద్ధం చేసుకున్నాక ఆ ప్రాంతంలో పేదల గృహ నిర్మాణం చేపట్టేందుకు మైనింగ్​భూములను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పేదల ఇళ్ల కోసం మైనింగ్​భూములను కేటాయించిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ యంత్రాంగంపై ఎలాంటి చర్యల్లేవు. కోర్టులో కేసు వేసిన సాధారణ టీడీపీ కార్యకర్త గురించి అసెంబ్లీలో సీఎం జగన్​నుంచి కిందిస్థాయి వైసీపీ కార్యకర్త దాకా పేదల ఇళ్ల స్థలాలకు టీడీపీ అడ్డుపడిందని నానా యాగీ చేస్తున్నారు. చివరకు పేదల గూడును కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని జనం దుమ్మెత్తి పోస్తున్నారు.

అటవీ, పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ ప్రాంతంలో రోడ్లపై గుంతలు కనపడకుండా చేయడంలో విజయం సాధించారు. అలా సాధించిన ఒక్క విజయాన్ని జిల్లాలో మంత్రిగా చేసిన బాలినేని, ఆయన బామ్మర్ది వైవీ సుబ్బారెడ్డి చెప్పుకోగలరా! అంటూ జనం మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్లు లేరు. చివరకు సీఎం జగన్​ బంధువులే వైసీపీ పతనానికి దారితీయడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇకనైనా అధికార పార్టీలోని సీఎం బంధువులు ఆలకిస్తారా ! జనమంటే లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తారా అనేది జిల్లా ప్రజల్లో చర్చనీయాంశమైంది.

READ MORE

ఇద్దరు ముద్దు.. మూడోవారు వద్దు: పొత్తులపై ఎంపీ GVL కీలక వ్యాఖ్యలు



Next Story

Most Viewed