ఈ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితులు... ఎమ్మెల్యే అయినా సరే లొంగి ఉండాల్సిందే!

by Disha Web Desk 16 |
ఈ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితులు... ఎమ్మెల్యే అయినా సరే లొంగి ఉండాల్సిందే!
X

దిశ, దక్షిణ కోస్తా: సంతనూతలపాడు జిల్లా కేంద్రం ఒంగోలును ఆనుకొని ఉన్న నియోజకవర్గం. పైగా ఎస్సీ రిజర్వుడు. ఇక్కడ ప్రధాన పార్టీల జిల్లా నాయకుల కనుసైగలతోనే పెత్తనం నడుస్తుంది. అపారమైన గ్రానైట్​గనులు, పారిశ్రామిక వాడలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. సంతనూతలపాడుకు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా జిల్లా నాయకుల బాహుబలిలో ఇమిడిపోవాలి. లేకుంటే దబిడి దిబిడే. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండే ఈ నియోజకవర్గం క్రమేణా వాళ్ల చేతుల్లో నుంచి జారిపోయింది. తర్వాత టీడీపీ హయాంలో పాలపర్తి డేవిడ్​రాజు ఎమ్మెల్యేగా చేశారు. ఎన్నడూ జిల్లా నాయకత్వంతో తేడా రాలేదు. 2004లో కాంగ్రెస్​నుంచి ఎన్నికైన దారా సాంబయ్య మాత్రం నా నియోజకవర్గంలో మీ జోక్యమేంటని జిల్లా నాయకులను నిలదీశారు. మళ్లీ టీడీపీ నుంచి ఎన్నికైన బీఎన్​విజయకుమార్‌తో లోకల్​నాయకుల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్​కూడా ఇక్కడ ఓ దఫా ఎమ్మెల్యేగా చేశారు. ముళ్లపై ఆరేసిన దుస్తులను జాగ్రత్తగా తీసుకున్నట్లు ఆయన ఇక్కడ నుంచి ఎలాంటి ఆరోపణలు లేకుండా బయటపడి యర్రగొండపాలెం వెళ్లిపోయారు.


ఎమ్మెల్యే టీజేఆర్​ సుధాకర్​బాబుపై పలు ఆరోపణలు

అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్​ సుధాకర్​బాబు స్థానిక నాయకుల నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నాగులుప్పలపాడు, మద్దిపాడు మండలాలకు చెందిన కమ్మ సామాజిక వర్గ నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఎమ్మెల్యే టీజేఆర్​సుధాకర్​బాబు తమకు తగు ప్రాధాన్యమివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఆరోపణలకే పరిమితం కాలేదు. ఏకంగా ఓ సమావేశం పెట్టుకొని పార్టీ పెద్ద తలకాయకు ఫిర్యాదు చేశారు. అయినా ఎమ్మెల్యే తమకు అనుకూలంగా లేరని బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఈసారి సుధాకర్​బాబుకు సీటు ఇస్తే మాదారి మేం చూసుకుంటామంటూ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చేదాకా వెళ్లారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల నేతల మనస్సుల్లో ఏమున్నా అసంతృప్తులు బయటపడలేదు.

అభివృద్ధికి కేటాయించని నిధులు

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. అన్నీ శాఖల నిధులు సంక్షేమానికే మళ్లించారు. సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక, పథకాల పంపిణీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా జోక్యం కల్పించలేదు. అంతా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారానే నడిపించారు. ఏదో ఉద్యోగుల బదిలీలకు సిఫారసు లేఖలు ఇచ్చుకోవడమే ఎమ్మెల్యే పని అన్నట్లు పాలన సాగింది. మూడేళ్లు గడిచాక సీఎం జగన్​కు అసలు సమస్య అవగతమైంది. ఇక గడపగడపకూ ఎమ్మెల్యేలను తిప్పుతూ ప్రతీ సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఈపాటికే కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసిన పనులకు బిల్లులు రాలేదు. ఆ ప్రభావం ఎమ్మెల్యేలపైనా తీవ్రంగా ఉంది. ఇప్పుడు కేటాయించిన నిధులకు సంబంధించి పంపకాల్లో ఎక్కడో తేడా కొట్టినట్లుంది. ఎక్కడికక్కడే అసంతృప్తులు తారాస్థాయికి చేరాయి.


అసమ్మతి వెనుక పెద్ద తలకాయ హస్తం?

ఈ అసమ్మతి వెనుక జిల్లా కేంద్రంలోని పార్టీ పెద్ద తలకాయ హస్తం ఉండొచ్చనే ప్రచారం కూడా ఉంది. ఈ తలనొప్పులు అధికార పార్టీకే కాదు. ప్రతిపక్ష టీడీపీలోనూ నెలకొంది. ఇన్​చార్జి బీఎన్​విజయకుమార్​ఆది నుంచి ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారు. అది నియోజకవర్గంలో పెత్తనం చేసేవాళ్లకు నచ్చడం లేదు. అందువల్ల ఈ దఫా ఎన్నికల నాటికి రెండు పార్టీల్లో కొత్త ముఖాలు రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఆరేటి కోటయ్య, తవనం చెంచయ్య మినహా రెండోసారి ఎమ్మెల్యే అయినవాళ్లు లేకపోవడం విశేషం.


Next Story

Most Viewed