అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ : మంత్రి నారాయణ

by Thanuru Gopichand |

ఏపీ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ (Potti Sriramulu Memorial Park) పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) తెలిపారు.

అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ (Potti Sriramulu Memorial Park) పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నెల్లూరులో నిర్వహించారు. అందులో భాగంగా నెల్లూరులో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శనం మేరకు పొట్టి శ్రీరాములు జన్మించిన ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆయన గౌరవార్థం రాజధాని అమరావతిలో చేపట్టిన పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రూపకర్తగా కాదు, గొప్ప సంఘ సంస్కర్తగా కూడా ఆయనను ప్రజలు ఎన్నటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.

6.8 ఎకరాల స్థలంలో మెమోరియల్ పార్క్

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం అమరావతిలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్మారక వనం (మెమోరియల్ పార్క్) నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలోని శాఖమూరులో 6.8 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా చేపడుతున్నాయి. ఈ మెమోరియల్ పార్కును వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పార్కులో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' (Statue of Sacrifice) పేరుతో 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరావతి చరిత్రను, పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం, 50 సీట్ల సామర్థ్యం గల మినీ థియేటర్ ఇందులో భాగంగా ఉండనున్నాయి. బహిరంగ సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఒక విశాలమైన ఆడిటోరియంను కూడా నిర్మితమవుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ పార్కు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఒక ముఖ్యమైన చారిత్రక, పర్యాటక కేంద్రంగా మారనుంది.

Next Story