గ్రేటర్ విశాఖను కమ్మేస్తున్న కాలుష్యం

by Thanuru Gopichand |

గ్రేటర్ విశాఖపట్నంను (Vishakapatnam) కాలుష్యం కమ్మేస్తోంది. నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది.

గ్రేటర్ విశాఖను కమ్మేస్తున్న కాలుష్యం
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ విశాఖపట్నంను (Vishakapatnam) కాలుష్యం కమ్మేస్తోంది. నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గాలి నాణ్యత (AQI) క్షీణించడంతో పర్యావరణ శాఖ 'వార్నింగ్ బెల్స్' మోగించింది. ముఖ్యంగా శీతాకాలం ప్రభావం, పారిశ్రామిక ఉద్గారాలు తోడవ్వడంతో నగరంపై కాలుష్యం కోరలు చాస్తోంది. తాజా గణాంకాల ప్రకారం విశాఖలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 'వెరీ పూర్' (VerY Poor) కేటగిరీలోకి పడిపోయింది. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన సమాచారం ఈ ఆందోళనకర పరిస్థితిని స్పష్టం చేస్తోంది.

అత్యధికంగా

​నగరంలో అత్యధికంగా అశీల్ మెట్ట ప్రాంతంలో కాలుష్య తీవ్రత నమోదైంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 308 కు చేరుకోవడంతో స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జ్ఞానపురంలో 240, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆటో నగర్, సూర్య బాగ్ వంటి రద్దీ ప్రాంతాల్లో కాలుష్య స్థాయి 217 గా రికార్డైంది. పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో గాలిలో ధూళికణాలు (PM 2.5, PM 10) ఉండాల్సిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మోస్తరుగా

​మరోవైపు మింది, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార వంటి నివాస ప్రాంతాల్లో కాలుష్యం ఓ మోస్తరుగా అంటే 132 పాయింట్లుగా నమోదైంది. అయినప్పటికీ గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ఈ కాలుష్య నియంత్రణకు కాలుష్య నియంత్రణ మండలి (APPCB) మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని, వాహన కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

Next Story