జగన్ vs సత్యకుమార్.. తీవ్రరూపం దాల్చుతోన్న వైరం!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-19 10:57:33  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం హీటెక్కింది...

జగన్ vs సత్యకుమార్.. తీవ్రరూపం దాల్చుతోన్న వైరం!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రాజకీయం హీటెక్కింది. వైసీపీ(Ycp) వర్సెస్ బీజేపీ(Bjp)గా మారిపోయింది. కూటమి సర్కార్‌పై వైసీపీ చేస్తున్న విమర్శలకు బీజేపీ సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. పీపీపీ(PPP) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైఎస్ జగన్(Ys Jagan) చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. దీంతో వైఎస్ జగన్, మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) మధ్య సవాళ్ల వార్ నడుస్తోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థవంతంగా పాలన అందిస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని తీసుకురావడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) వ్యతిరేకించింది. ప్రభుత్వ విధానాన్ని తప్పు బట్టింది. తమ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఉద్యమం చేపట్టింది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్టవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ ప్రతులను గవర్నర్‌కు అప్పగించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని తిరస్కరించాలని కోరింది.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. గవర్నర్‌ను కలిసిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ మాత్రం చాలా సెన్సేషన్ అయ్యాయి. దీంతో రాష్ట్ర బీజేపీ నొచ్చుకుంది. తాము అధికారంలో వస్తే తప్పుడు విధానాలతో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రద్దు చేయడంతో పాటు ఆ నిర్ణయం తీసుకున్న నాయకులను, మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని అరెస్ట్ చేస్తామని వైఎస్ జగన్ హెచ్చరించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇకపై సై అంటే సై అనే సంకేతాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదని, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నానని కాబట్టి తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. జగన్‌కు దమ్ముంటే ముందుగా తనను జైలుకు పంపాలని, సీబీఐ విచారణ కోరాలని ఛాలెంజ్ చేశారు. మెడికల్ కాలేజీ విషయంలో తన ఆటవిక మనస్థత్వాన్ని జగన్ బయటపెట్టారని విమర్శించారు. మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు ముందుకు వస్తున్న సంస్థల వెంట్రుక కూడా పీకలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు జగన్ కేసుల పుట్టుపుర్వత్రాలను కూడా మంత్రి సత్యకుమార్ బయటకు తీశారు. జగన్‌పై 30 కేసులున్నాయని, ముందు వాటిని చూసుకోవాలని హితవు పలికారు. అయితే జగన్‌పై వివిధ కేసులున్న విషయం దేశమంతా తెలుసు. ఆ కేసుల విచారణ కొనసాగుతోంది. కొన్ని కేసుల్లో వాదనలు వినిపిస్తున్నారు. ఆస్తుల కేసులో ఇటీవల వైఎస్ జగన్ కోర్టుకు సైతం హాజరయ్యారు. అయితే మంత్రి సత్యకుమార్ చేసిన కేసుల కామెంట్స్ సంచలనంగా మారాయి.

రాష్ట్రంలో కూటమి భాగస్వామిగా బీజేపీ ఉంది. ఇప్పటివరకూ కూటమి నాయకులపై జగన్ చేసిన విమర్శలకు బీజేపీ నాయకులు ఇచ్చిన కౌంటర్లు నార్మల్‌గానే ఉన్నాయని పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయం ప్రధాని మోడీ దృష్టికి సైతం వెళ్లాయి. ఈ మేరకు పాలన పరంగా ఇటీవల ఏపీ బీజేపీ నాయకులను ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇవ్వాలని సూచించారు. అంతలో పీపీపీ విధానంపై జగన్ చేసిన అరెస్ట్ కామెంట్స్ చేయడంతో మంత్రి సత్యకుమార్ వెంటనే రియాక్ట్ అయ్యారు. జగన్ దీటుగా అంతేస్థాయిలో ఇచ్చి పడేశారు. దీంతో మిగిలిన బీజేపీ నేతలు సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారట. వైసీపీ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇలా ప్రధాని మోడీ ఇచ్చిన ధైర్యం, మంత్రి సత్యకుమార్ భరోసాతో బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

READ MORE ....

జగన్ బంధువు అర్జున్ రెడ్డి అరెస్ట్

Next Story