ప‌వ‌న్ కుమారుడిపై అనుచిత పోస్టులు... అల్లు అర్జున్ అభిమాని అరెస్ట్!

by Ajay kumar |   ( Updated:2025-04-16 13:07:48.0  )
ప‌వ‌న్ కుమారుడిపై అనుచిత పోస్టులు... అల్లు అర్జున్ అభిమాని అరెస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ ఇటీవ‌ల సింగ‌పూర్‌లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. అయితే కొందరు నీచులు ఆ పిల్లవాడిని సైతం టార్గెట్ చేశారు. సినిమాలకు ఎలాంటి సంబంధం లేని అభంశుభం తెలియని పిల్లవాడిపై ఫ్యాన్స్ వార్ లో కొందరు అనుచిత పోస్టులు పెట్టారు. దీంతో వారిపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలా పోస్టులు పెట్టినవారిలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న అనంతరం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ అభిమానుల ఫ్యాన్ వార్ లో భాగంగానే రఘు మార్క్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారని తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామన్నారు. రఘు ఐదు మొబైల్ ఫోన్లను వాడినట్టు, 14 మెయిల్ ఐడీలను వాడినట్టు గుర్తించామన్నారు.

మహిళలను టార్గెట్ చేస్తూ నిందితుడు ఎక్కువగా పోస్టులు పెట్టారని చెప్పారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టినందుకు రఘుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొద్దిరోజులుగా ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానులపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో చిన్నపిల్లలను సైతం టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed