మహిళా విద్యలో కీలక పాత్ర పోషించారు : సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-03 04:20:12  IST  )

నేడు సావిత్రి బాయి పూలే జయంతి.

మహిళా విద్యలో కీలక పాత్ర పోషించారు : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే (Savithri Bai Phule) జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే (Jyothiba Phule) సతీమణిగానే కాకుండా మహిళా సాధికారతకు (Women Empowerment) నిలువెత్తు రూపంగా ఆమె గుర్తింపు పొందారు. దంపతులిద్దరూ విద్య, సామాజిక న్యాయం, మహిళల హక్కులు, అణగారిన వర్గాల విముక్తి కోసం జీవితాన్ని అంకితం చేశారు. ముఖ్యంగా దేశంలో బాలిక విద్యకు పునాదులు వేశారు. అంతేకాకుండా తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రి బాయి పూలే చరిత్రకెక్కారు. సామాజికవేత్తగా, సంఘ సంస్కర్తగా ప్రజల సంక్షేమానికి పని చేశారు. నేడు సావిత్రి బాయి జయంతిని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు.

మహిళలను విద్యావంతులుగా చేసేందుకు సమాజ కట్టుబాట్లను కాదనే సాహసాన్ని సావిత్రి బాయి చేశారని సీఎం అన్నారు. తద్వారా దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందారన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. ఆనాడు ఆమె చేసిన సాహసం ఈనాడు మహిళలను విద్యావంతులుగా చేయడమే కాకుండా పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసేలా తీర్చిదిద్దింది అనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు. అందుకే సావిత్రిబాయి పూలేకు ఆధునిక మహిళలు సదా కృతజ్ఞతలు తెలపాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సమాజంలో సగభాగమైన మహిళా విద్యలో కీలక పాత్ర పోషించిన సావిత్రీ బాయి పూలేకు మరొక్కమారు ఘన నివాళి అర్పిస్తున్నానని తెలియపరిచారు.

మంత్రి నారా లోకేశ్ నివాళి

సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే మన దేశ మొట్టమొదటి మహిళా టీచర్ అని పేర్కొన్నారు. స్త్రీ విద్య, వారి హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తివంతమైన సాధనంగా భావించారని తెలిపారు. సామాజిక అసమానతలు, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారన్నారు. నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె మార్గదర్శి అని అభిప్రాయపడ్డారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అని ప్రకటించారు.

Next Story