అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.. చంద్రబాబు వ్యాఖ్యలపై పేర్నినాని రియాక్ట్..

by Ramesh Naini |

అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.. చంద్రబాబు వ్యాఖ్యలపై పేర్నినాని రియాక్ట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇవాళ స్పందించారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యావసాయం, ధాన్యాగారంగా ఏపీకి బ్రాండ్ ఉందేదని, అలాంటి బ్రాండ్‌ను దెబ్బ తీసింది చంద్రబాబే అని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే అని విమర్శించారు. చంద్రబాబు గంటన్నర ప్రసంగంలో అసత్యాలు, నిందలు విషం వెదజల్లారని అన్నారు. రైతులను గుడ్డి కన్నుతో చూడడం చంద్రబాబు విధానమని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారని, తీరా ఎన్నికలయ్యాక రూ.3.33 లక్షల కోట్ల అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తుకు చేశారు. ఇప్పుడేమో మళ్లీ రూ.10 లక్షల కోట్లని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాళాకోరు ప్రభుత్వం చంద్రబాబుదేనని.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల 66 వేల 516 కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చినవాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్ట్‌గా చెయ్యి పెట్టి తీసుకొవచ్చన్నారు. రాష్ట్ర భవిష్యత్తును, ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని.. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story