YS Jagan : వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు అనుమతి మంజూరు

by Muthe.Rajitha |

పల్నాడు(Palnadu)లో రేపు జరగనున్న మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పర్యటనకు ఎట్టకేలకు అనుమతి లభించింది.

YS Jagan : వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు అనుమతి మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు(Palnadu)లో రేపు జరగనున్న మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పర్యటనకు ఎట్టకేలకు అనుమతి లభించింది. రేపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల గ్రామంలో జరగనున్న వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త, రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్ హాజరవుతున్న నేపథ్యంలో.. పలు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాస రావు. జగన్ సెక్యూరిటీ కాన్వాయ్‌తో పాటు కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. రెంటపాళ్ల గ్రామం చిన్నది కావడం, క్రోసూరు–అచ్చంపేట రహదారిలో ఇరుకైన రోడ్డు ఉండడం వల్ల భారీ జనసమీకరణకు అవకాశం లేక శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు.

సత్తెనపల్లి వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించి జనసమీకరణ, వాహనాల రాకపోకలు, బారికేడింగ్, ఈవెంట్ నిర్వహణ బాధ్యత వంటి అవసరమైన వివరాలను అందించలేదని, పోలీసులు పదేపదే అడిగినా సమాచారం ఇవ్వకపోవడంతో అనుమతులపై ఆంక్షలు విధించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు తనిఖీలో 30,000 మందికి ఆహార ఏర్పాట్లు చేసినట్లు గుర్తించడంతో ఇరుకైన ప్రాంతంలో భారీ జనసమీకరణ వల్ల రద్దీ నియంత్రణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహావిష్కరణ ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలిగితే, అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Next Story