నెల్లూరులో పెంచలయ్య హత్య కేసు.. దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు

by Ramesh Naini |

నెల్లూరులో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నెల్లూరులో పెంచలయ్య హత్య కేసు.. దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరులో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో కొందరు ముసుగుదారులు సీపీఎం ఆర్డీటీ కాలనీ శాఖ సభ్యుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య (38)పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై నెల్లూరు రూరల్‌ పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. శనివారం తెల్లవారుజామున నిందితులు కోవూరులోని షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారన్న సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడ ముట్టడి చేపట్టారు. అయితే పోలీసులు చేరుకోగానే నిందితులు కత్తులతో దాడికి దిగడంతో కానిస్టేబుల్‌ ఆదినారాయణ గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ప్రతిదాడిగా కాల్పులు జరపగా నిందితుడు జేమ్స్‌ మోకాలిలో గాయపడి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. ఇంకా పరారీలో ఉన్న తొమ్మిది మంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, పెంచలయ్య హత్యకు గల కారణాలపై పోలీసులు కీలక సమాచారం వెలికితీశారు. కల్లూరుపల్లికి చెందిన అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. గంజాయి రవాణా, చోరీలు, ఇతర నేరాలకు సంబంధించిన గ్యాంగ్‌ను ఆమె ఆధారపడి నడుపుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ అక్రమచర్యలను విమర్శిస్తూ, ఆపాలని పెంచలయ్య పలుమార్లు సూచించడంతోనే కామాక్షమ్మ అసహనం వ్యక్తం చేసి, తన గంజాయి గ్యాంగ్‌కు చెందిన తొమ్మిది మందితో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దాడిలో పాల్గొన్న ముసుగుదారులు హత్యకు ముందే పెంచలయ్యను స్కూటీపై వెళ్తుండగా వెంబడించి అమానుషంగా దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. అరవ కామాక్షమ్మపై గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెంచలయ్య హత్యతో కల్లూరుపల్లి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, నిందితుల అరెస్టు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు.

Next Story