పవన్ సార్.. మాకు న్యాయం చేయండి : జనసేన నేత కుమార్తెల కన్నీటి ఆర్తనాదం!

by Ramesh Naini |

తమకు ఎవరూ లేరని, ఇప్పుడు తమకు ఉన్న ఏకైక ఆశ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆ యువతులు వేడుకున్నారు.

పవన్ సార్.. మాకు న్యాయం చేయండి : జనసేన నేత కుమార్తెల కన్నీటి ఆర్తనాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘డాడీ.. నీకు మా పరిస్థితి అర్థం అవుతుందా? అమ్మను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నావు. మమ్మల్ని చూసేందుకు వారానికి ఒక్కసారి అయినా రావాలనిపించలేదా? మాకు న్యాయం జరగకపోతే చనిపోవడం తప్ప మరో మార్గం లేదు..’ అంటూ ఇద్దరు యువతులు విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జనసేన నేత మల్లాది రాజు కుమార్తెలుగా చెప్పుకుంటున్న ఇద్దరు యువతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వీడియో విడుదల చేశారు. తమ తండ్రి తమను, తమ తల్లిని నట్టేట ముంచారని వారు ఆరోపించారు. మల్లాది రాజు తాను నడుపుతున్న ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఒక మహిళను రెండో వివాహం చేసుకున్నారని, అప్పటి నుంచి తమ కష్టాలు మొదలయ్యాయని వారు కన్నీరుమున్నీరయ్యారు.

తండ్రి వేధింపులు.. తల్లి ఆత్మహత్య

తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో తమ తల్లి తీవ్ర మానసిక క్షోభకు గురైందని ఆ సోదరీమణులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆమె కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, చివరకు తండ్రి వేధింపుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని వారు వెల్లడించారు.

ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధింపులు

తల్లి మరణం తర్వాత తమను అక్కున చేర్చుకోవాల్సిన తండ్రి, మరింత క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆ యువతులు ఆరోపించారు. ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇల్లు తమ తండ్రి పేరు మీద ఉన్నప్పటికీ, తాము దానిని అక్రమంగా కబ్జా చేశామంటూ తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు. తమకు అండగా నిలుస్తున్న అమ్మమ్మ, మావయ్యలపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ మానసిక హింసకు గురిచేస్తున్నారని వారు వాపోయారు.

పవన్ కల్యాణ్ సార్.. మీరే మా చివరి ఆశ!

తమకు ఎవరూ లేరని, ఇప్పుడు తమకు ఉన్న ఏకైక ఆశ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆ యువతులు వేడుకున్నారు. ‘పవన్ సార్.. మీరు ఆడబిడ్డల పక్షపాతి అని మాకు తెలుసు. మా తండ్రి వల్ల మాకు ప్రాణహాని ఉంది. ఆయనపై చర్యలు తీసుకుని, మాకు న్యాయం చేయండి. లేదంటే మాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ వారు చేసిన విన్నపం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Next Story