‘పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-30 12:51:19  IST  )

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

‘పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ తరుణంలో సింహాచలంలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈ తరుణంలో సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు(Devotees) మృతి చెందారు.

ఈ విషాద ఘటన పై వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందంటూ విమర్శించారు. చందనోత్సవానికి లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించందని ఆయన మండిపడ్డారు.


నాసిరకం పనుల వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. సమీక్ష సమావేశాలు నిర్వహించి టికెట్ల పంపిణీ గురించి చర్చించారు కానీ భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి పెట్టరా? అని ప్రశ్నించారు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలో గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడలని, ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story