అటవీ భూముల ఆక్రమణపై పవన్ కల్యాణ్ సంచలన వీడియో విడుదల.. మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వీడియో విడుదల చేశారు.

అటవీ భూముల ఆక్రమణపై పవన్ కల్యాణ్ సంచలన వీడియో విడుదల.. మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Ap Deputy Cm Pawan Kalyan) సంచలన వీడియో విడుదల చేశారు. ఇటీవల ఏరియల్‌ సర్వే నిర్వహించిన సమయంలో పవన్‌ వీడియోలు తీశారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఈ వీడియో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి వర్గానికి ఈ విషయంపై నివేదిక అందజేసి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఎక్స్‌లో పేర్కొన్న వివరాలు.. తూర్పు ఘాట్ పరిసరాల్లోని మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల ఆక్రమణ జరిగిందని పేర్కొన్నారు. మాజీ అటవీ శాఖ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో సంబంధం ఉన్న 76.74 ఎకరాల అక్రమ ఆక్రమణలు వెలుగుచూశాయని తెలిపారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని ఆరోపించారు. విజిలెన్స్‌ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూములను ఆక్రమించిన వారందరి పేర్లను శాఖ వెబ్‌సైట్‌లో ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి వ్యక్తి ఆక్రమించిన భూభాగం పరిమాణం, దానిపై ఉన్న కేసుల వివరాలు వెల్లడించాలన్నారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా.. ఎవరైనా సరే అటవీ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భూమి రికార్డుల్లో ఉన్న తారతమ్యాలు, అవకతవకలు, తదితర అంశాలను పరిశీలించాలన్నారు. న్యాయ నిపుణుల సూచనల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. భూమి రికార్డులన్నింటినీ డిజిటల్ చేయాలని, తద్వారా అవి ఎవరు మోసం చేయలేని విధంగా పారదర్శకతను స్థాపించాలని అన్నారు.

అటవీ భూములు దేశ ఆస్తులు అని పవన్ కల్యాణ్ అన్నారు. వాటిని ఆక్రమించేవారు, దుర్వినియోగం చేసేవారు లేదా అటవీ చట్టాలను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే.. వారందరినీ చట్టం ముందు నిలబెడతాం.. అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ ప్రాంతాలు ఆక్రమణను సహించదని పవన్ హెచ్చరించారు. ట్వీట్ ఇదే..

Next Story