పరకామణి చోరీ కేసు: హైకోర్టుకు సీఐడీ అదనపు నివేదిక

by Thanuru Gopichand |

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ (Parakamani Chori Case) కేసు లోక్ అదాలత్ రాజీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

పరకామణి చోరీ కేసు: హైకోర్టుకు సీఐడీ అదనపు నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి పరకామణి చోరీ (Parakamani Chori Case) కేసు లోక్ అదాలత్ రాజీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ (CID) తాజాగా హైకోర్టుకు అదనపు నివేదికను సమర్పించింది. లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం చట్టబద్ధత ఎంతవరకు ఉందో తేల్చేందుకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. సీఐడీ సమర్పించిన అదనపు నివేదిక మరో రెండు సెట్లను రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వారికి సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. రిజిస్ట్రీ ఈ నివేదికలను పరిశీలన నిమిత్తం ధర్మాసనం ముందు ఉంచాలని స్పష్టం చేసింది. పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతకు సంబంధించిన అంశంపై న్యాయస్థానం కీలకంగా దృష్టి సారించింది. అదనపు నివేదికను పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఈ కేసులో 2023 ఏప్రిల్‌లో టీటీడీ మాజీ ఉద్యోగి రవికుమార్‌ విదేశీ కరెన్సీ (900-920 US Dollars) చోరీ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసు 2023 సెప్టెంబర్‌లో లోక్ అదాలత్‌లో రాజీ కుదరగా, నిందితుడు రవికుమార్ సుమారు రూ. 14 కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా రాసిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రాజీ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కారణంగా హైకోర్టు సీఐడీ, ఏసీబీలకు దర్యాప్తు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతితో కేసు తీవ్రత మరింత పెరిగింది.

Next Story