- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
#OperationAranya | ఆపరేషన్ కగార్ తరహాలో ఎర్ర చందనం స్మగ్లర్ల వేట!
అరణ్యాల్లోని మావోయిస్టులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : అరణ్యాల్లోని మావోయిస్టులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. అదే తీరులో ఎర్ర చందనం స్మగ్లర్లను నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఆపరేషన్ అరణ్య (Operation Aranya) చేపట్టనుంది. అందుకు సంబంధించిన విషయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇటీవల మంగళం డిపోను డిప్యూటీ సీఎం సందర్శించారు. అక్కడ ఉన్న ఎర్ర చందనం దుంగలు చూసి ఆయన చలించిపోయారు. 2.6 లక్షల దుంగలను చూసి బాధపడ్డారు. అత్యంత కిరాతకంగా వాటిని నరికివేశారని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. శేషాచలం (Seshachalam) అంటే కేవలం అడవి కాదని.. తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర క్షేత్రమని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లభించని ఎర్ర చందనం (Red Sandlers) ఇక్కడ లభిస్తుందన్నారు. అటువంటి అరుదైన సంపదను కాపాడుకోవాల్సింది పోయి.. డబ్బుల కోసం కిరాతకంగా నరికివేయడం తప్పని అన్నారు. ప్రస్తుతం నరకబడిన ఎర్ర చందనం దుంగలు ప్రజల సంపదగా పేర్కొన్నారు.
ఎవరిచ్చారు హక్కు?
కొంత మంది వ్యక్తులు అడవులను ఆక్రమించి చెట్లను ఇష్టారీతిన నరికే హక్కును ఎవరిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పట్ట పగలు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులు, భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థల నుంచి స్మగ్లర్లు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. గత పాలకుల పాలనా వైఫల్యానికి ఇది నిదర్శనం అన్నారు. ప్రశ్నించడం ఆపేసి న్యాయం కోసం డిమాండ్ చేయడం ప్రారంభించాలన్నారు. పురాతన అటవీ సంపదను కాపాడుకోని దాన్ని నాశనం చేయాలని చూస్తున్నవారికి చట్టం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇక ఏ మాత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ ను సహించదని స్పష్టం చేశారు. స్మగ్లర్లను, వారిని నడిపించే నాయకులను, ఎర్ర చందనం స్మగ్లింగ్ లో భాగస్వాములైన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు.
ఆపరేషన్ అరణ్య
కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ కగార్ వంటి ఆపరేషన్ అరణ్యను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తామన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో భాగస్వాములైన ప్రతిఒక్కరికి పట్టుకుంటామన్నారు. కేవలం అరెస్టు చేసి సరిపెట్టబోమన్నారు. నిందితుల ఆస్తులను అటవీ చట్టాల ప్రకారం సీజ్ చేస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క ఎర్ర చందనం చెట్టును తాకాలన్నా కూడా భయపడేలా చేస్తామన్నారు. ఎందుకంటే ఎర్ర చందనం జాతీయ సంపద అన్నారు. ఎంతో పవిత్రమైన చెట్టుగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అన్ని చూస్తోందని.. శేషాచలం అడవుల పవిత్రతను కాపాడి తీరుతుందని స్పష్టం చేశారు.






