- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MahaSivaratri: హర హర మహాదేవ.. భక్తిశ్రద్ధలతో శివరాత్రి పర్వదినం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి.

దిశ డైనమిక్ బ్యూరో / శ్రీశైలం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం (Srisailam), కోటప్పకొండ (kotappakonda), శ్రీకాళహస్తి (Srikalahasti), పాలకొల్లు (palakollu), అమరావతిలోని (Amaravathi) ఆలయాల్లో మహాశివరాత్రి (mahasivaratri) వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏడో రోజు గజ వాహనంపై స్వామివారు దర్శనం ఇచ్చారు. ఇవాళ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని అమరామానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండపై మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున బిందెతీర్థంతో శ్రీత్రికోటేశ్వర స్వామికి తొలిపూజ ప్రారంభమైంది. అనంతరం ఆలయ పండితులు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం కోటప్పకొండ తిరుణాళ్ల వేడుకగా జరగనుంది. ఇందుకోసం ప్రభలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. అదేవిధంగా ఏపీలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్దఎత్తున శివస్వాములు, సాధారణ భక్తులు అధికసంఖ్యలో క్షేత్రానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో భక్తులు, శివస్వాములు బారులు దీరారు. భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది, ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూలైన్ల ద్వారా భక్తులు దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతోంది. శివదీక్షా భక్తులకు మాత్రం ప్రత్యేకంగా చంద్రావతి కళ్యాణ మండపం నుంచి క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, శివరాత్రి ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనం కల్పించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రధాన వీధులన్నీ కళకళలాడుతున్నాయి.






