చంద్రబాబు పాత కేసులను తిరగదోడుతున్న వైసీపీ: తెరపైకి తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన కేసు

by Seetharam |   (  Updated:2023-10-01 07:01:09  IST  )

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరిన్ని చిక్కుల్లో పడబోతున్నారా?

చంద్రబాబు పాత కేసులను తిరగదోడుతున్న వైసీపీ: తెరపైకి తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన  కేసు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరిన్ని చిక్కుల్లో పడబోతున్నారా ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంకా కేసులు వెంటాడుతూనే ఉన్నాయా? చంద్రబాబును ఈ కేసులో కాదు గతంలో కేసులు కూడా తెరపైకి రాబోతున్నాయా? ఆ కేసులతో కూడా చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయాలనదే వైసీపీ ప్లానా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు అత్యధికరోజులు చంద్రబాబును జైల్లోనే ఉంచాలన్నది వైసీపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే పలు కేసులను చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో కనుమరుగైపోయిందనకున్న ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వరుస కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. స్కిల్ స్కాం కేసులోనే చంద్రబాబు నాయుడు చుక్కలు చూస్తున్న తరుణంలో మరికొన్ని కేసులు సైతం వెంట వెంటనే కోర్టుల్లో ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు పాత కేసులను సైతం తిరగదోడుతున్నారు. అలాంటి పాతకేసే ఓటుకు నోటు కేసు. ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారం ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చుట్టూనే తిరిగింది. రేవంత్ రెడ్డి జైలుకు సైతం వెళ్లొచ్చారు. అయితే తాజాగా కేసు మళ్లీ తెరపైకి రావడం అందులోనూ చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని కోరడం, కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. చంద్రబాబు నాయుడును జైలు నుంచి బయటకు రాకుండా ఎన్నికేసులు ఉంటే అన్ని కేసులు తీసుకురావాలనే అక్కసుతో వైసీపీ ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబుకు గడ్డుకాలం

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు గడ్డుకాలం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొలేని విధంగా కేసులు చుట్టుముడుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి అనేకమంది కేసులు వేసినప్పటికీ చంద్రబాబు స్టేలు తెచ్చుకుని ఉపశమనం పొందేవారు. కానీ నేడు ప రిస్థితి అలా లేదు. సీన్ మెుత్తం రివర్స్ అయ్యింది. స్టే తెచ్చుకునే ఛాన్స్ లేకుండానే సీఐడీ కేసులు దాఖలు చేస్తోంది. దీంతో ఎప్పుడూ కనీసం కోర్టు మెట్లు సైతం ఎక్కలేని చంద్రబాబు నేడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి. ఒక కేసు నుంచి చంద్రబాబు బెయిల్‌పై విడుదలైనా మరోకేసులో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేనటువంటి పరిస్థితి. వరుస పెట్టి ఏపీ సీఐడీ కేసులు పెడుతూనే ఉంది. ఇప్పటికే చంద్రబాబు కేసులు విచారణలో ఉన్నాయి. మరోవైపు న్యాయస్థానాల్లో చంద్రబాబుకు ఉపశమనం సైతం కలగడం లేదు. ముందస్తు బెయిల్ కోరినప్పటికీ రావడం లేదు. ఇప్పటికే చంద్రబాబుపై స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఇలాంటి కేసులు ఉన్నప్పటికీ తాజాగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో సైతం చంద్రబాబు పేరును సీఐడీ నమోదు చేసింది. ఈ కేసులతోపాటు తాజాగా ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం రాజకీయాల్లో కలవరం మెుదలైంది.

తెరపైకి ఓటుకు నోటు కేసు

ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులతో పాటు గతంలో తెలంగాణలో నమోదైన ఓటుకు నోటు కేసు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 4న సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు లిస్టైంది. వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో 2017లో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. గతంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చుట్టూనే ఈ కేసు తిరిగింది. అసలు కేసు విషయానికి వస్తే గతంలో జరిగిన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వేంనరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకొనేందుకు బీఆర్ఎస్‌కు చెందిన నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తనపై ఉద్దేశపూర్వకంగా ఈ కేసును నమోదు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం కూడ ఉందని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు సైతం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై 2021 మే 27న ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు లేదు. దీతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు రావడంతో ఈ కేసుల వెనుక కూడా వైసీపీ కుట్ర ఉందనే ప్రచారం జరుగుతుంది.

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఏ-25గా చంద్రబాబు

ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ ఏ-25గా పేర్కొంది. మోసం, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి ఐపీసీ సెక్షన్లతో పాటు..అవినీతి నిరోధక చట్టం (పీసీయాక్ట్) ఐపిసి సెక్షన్ల కింద 2021లో ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ సైతం దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కాంలో నిబంధనలను ఉల్లంఘించడం, టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సీఐడీ ఆరోపించింది. ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టు తొలిదశ టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఐడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. రూ.330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్‌ను అనుకూలమైన కంపెనీకి కేటాయించడానికి టెండర్ ప్రక్రియను తారుమారు చేసినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తుంది. పేస్ పవర్ వంటి ఇతర బిడ్డర్లను తప్పించి టెరాసాఫ్ట్‌వేర్‌కు అప్పగించారని సీఐడీ ఆరోపించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని సీఐడీ చెప్తోంది. ఈ కేసులో అప్పటి గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు, హైదరాబాద్‌లోని నెట్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరికృష్ణ ప్రసాద్‌, గతంలో ఏపీఎస్‌ఎఫ్ఎల్ ఎండీగా పనిచేసిన కోగంటి సాంబశివరావుతో పాటు, ఇతరులపై కూడా సీఐడీ ఆరోపణలు చేసింది.

Next Story