విశాఖలో మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్ సమ్మె

by Malleboina Mahesh |

విశాఖలో 3వ రోజుకు చేరిన ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్ల సమ్మె.. ఛార్జీల పెంపుకై పట్టు.. వాహనాలు దొరక్క ఐటీ ఉద్యోగులు, ప్రయాణికుల బెంబేలు!

విశాఖలో మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్ సమ్మె
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో క్యాబ్, ఆటో డ్రైవర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. యాజమాన్యాలు వసూలు చేస్తున్న అధిక కమిషన్లను తగ్గించాలని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీస ఛార్జీలను (Minimum Fares) పెంచాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబెర్, రాపిడో (Ola, Uber, Rapido) డ్రైవర్ల సమ్మె శనివారం నాటికి వరుసగా మూడో రోజుకు చేరింది. డ్రైవర్ల సంఘాల పిలుపుతో నగరంలో మెజారిటీ క్యాబ్‌లు, ఆటోలు రోడ్డెక్కకపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద ఆంక్షలు

ఈ సమ్మె కారణంగా విశాఖకు వచ్చే సాధారణ ప్రయాణికులతో పాటు విధులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, వైజాగ్ ఎయిర్‌పోర్ట్ వద్దకు చేరుకున్న ప్రయాణికులకు యాప్‌లలో వాహనాలు బుక్ కాకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా మధురవాడ ఐటీ హబ్, సిరిపురం పరిసర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి వాహనాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే తరుణాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక లోకల్ ఆటోలు, ప్రైవేట్ వాహనదారులు భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. తమ డిమాండ్లపై యాజమాన్యాలు, రవాణా శాఖ అధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

Next Story