ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అమెరికాకు వెళ్తున్న తెలుగు యువకుడి మృతి

by Naga Rani Yarlagadda |

ఏలూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అమెరికాకు వెళ్తున్న తెలుగు యువకుడి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అమెరికాలో స్థిరపడి, స్వదేశానికి వచ్చిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు ఒడికి చేరుకున్నాడు. ముదినేపల్లి మండలం చినపాలపర్రు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. వనదుర్రు గ్రామానికి చెందిన జయరాం (27) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొనేందుకు సొంతూరికి వచ్చాడు. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాక తిరిగి అమెరికా వెళ్లేందుకు శనివారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

నిద్రమత్తు తెచ్చిన ప్రాణసంకటం

ప్రయాణ సమయంలో కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రాంగ్ రూటులో దూసుకెళ్లి, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక టిప్పర్‌ను అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో సీటులో ఇరుక్కుపోయిన జయరాం అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా.. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడిన కొడుకు, కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ ఇంట్లో జయరాం మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story