లోకేశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A-14గానమోదు

by Seetharam |   (  Updated:2023-09-26 08:56:21  IST  )

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేశ్ అరెస్ట్ తప్పదా?

లోకేశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A-14గానమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేశ్ అరెస్ట్ తప్పదా? ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టిన సీఐడీ ఇక లోకేశ్ వంతు కోసం ప్రయత్నిస్తోందా? చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరిన్ని అరెస్టులు జరుగుతాయంటూ సీఐడీ చేసిన ప్రకటన పరోక్షంగా లోకేశ్‌ అరెస్ట్ గురించేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నారా లోకేశ్ అరెస్ట్‌కు సీఐడీ రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో లోకేశ్ ప్రమేయం ఉందని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేశ్, అచ్చెన్నాయుడులు అరెస్ట్ అవుతారని ఏపీ మంత్రులు మైకుల ముందు ఊదరగొట్టారు. అయితే అది నిజమని నిరూపించేందుకు సీఐడీ రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే మంత్రులు ఆరోపించినట్లు స్కిల్ స్కామ్ కేసులో కాదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో . ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేశ్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో నారా లోకేశ్‌ను ఏ-14 నిందితుడిగా సీఐడీ నమోదు చేసింది. దీంతో లోకేశ్‌ను సీఐడీ అరెస్ట్ చేస్తోందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేశ్ ఈనెల 27న బుధవారం రాజమహేంద్రవరం రానున్నారు. అనంతరం యువగళం పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో సీఐడీ లోకేశ్‌ను నిందితుడిగా చేర్చడం పట్ల టీడీపీ శిబిరంలో గుబులు నెలకొంది.

చంద్రబాబు అరెస్ట్‌ పెద్ద మైనస్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 18 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఏనాడూ జైలుకెళ్లిన పరిస్థితులు లేవు. కనీసం కోర్టు మెట్లను సైతం ఎక్కలేదు. అలాంటి చంద్రబాబు నాయుడు జైల్లో 18 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడుపై గతంలో కేసులు నమోదు అయినప్పటికీ స్టేలు తెచ్చుకునేవారు. దీంతో ఆ కేసులపై విచారణకు అక్కడితో ఫుల్ స్టాప్ పడేది. దీంతో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లరని బయటే ఉంటారని టీడీపీ నేతల్లో చాలా మంది ఆశించి భంగపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబు నాయుడును బయటకు తెచ్చేందుకు టీడీపీ గట్టిగా శ్రమిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితాలు రావడం లేదు. చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానాల్లో చుక్కెదురవుతుంది. సుప్రీంకోర్టు నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి న్యాయవాదులను తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఒకదాంట్లో అంటే కనీసం ఒక దాంట్లో కూడా చంద్రబాబు నాయుడుకు ఉపశమనం కలగలేదు. ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఇక ఏసీబీ కోర్టు విషయానికి వస్తే సీఐడీకి కస్టడీ ఇచ్చింది. రిమాండ్ పొడిగించింది. ఇలా అనేక అంశాల్లో చంద్రబాబుకు ప్రతికూలంగా కోర్టుల ఆదేశాలు వస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. చంద్రబాబు నాయుడు జైలుపాలవ్వడంతో ఇక టీడీపీ భారం అంతా యువనేత లోకేశ్‌పైనే పడింది. నారా లోకేశ్ యువగళం పాదయాత్రను నిలిపివేసి తండ్రి అరెస్ట్, బెయిల్‌పై నుంచి విడిపించేందుకు హస్తిన కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ ఫలించడం లేదు.

ఇక లోకేశ్ వంతు

చంద్రబాబు నాయుడును జైలు లోపల నుంచి బయటపడేసేందుకు బయట ఉండి నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోకేశ్‌ను సైతం సీఐడీ టార్గెట్ చేసిందని తెలుస్తోంది. స్కిల్ స్కామ్ కేసులోనే లోకేశ్‌ను సీఐడీ అరెస్ట్ చేస్తోందని అంతా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇంతలో జాతీయ స్థాయిలో తన తండ్రి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మద్దతు కూడగట్టేందుకు లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. అంతేకాదు హస్తిన కేంద్రంగా న్యాయనిపుణులతోనూ చర్చిస్తున్నారు. ఈనెల 27న ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని ఆ మరుసటి రోజు నంచి యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఇంతలో సీఐడీ బాంబు పేల్చింది. మంగళవారం ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో లోకేశ్‌ను సీఐడీ నిందితుడిగా పేర్కొంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను ఏ14గా సీఐడీ పేర్కొంది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో నిందితుడిగా లోకేశ్ పేరును చేర్చింది. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను నాటి సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ, అవినీతి నిరోధకచట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ మెుదలు పెట్టింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తోపాటు పలువురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. తాజాగా లోకేశ్ పేరును కూడా చేర్చింది.

టీడీపీకి దిక్కెవరు?

ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం పార్టీ బాధ్యతలను లోకేశ్ మోస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో సీఐడీ లోకేశ్‌ను అరెస్ట్ చేసి జైలు పాల్జేస్తే పరిస్థితి ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీడీపీ పగ్గాలు ఎవరు తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలను ముందే ఊహించే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించిందా అనేసందేహాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు నారా బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించి ఆమె నేతృత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణి ఒక్కరే ఈ పార్టీ బాధ్యతలు మోయగల సత్తా ఉందని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.

Next Story