రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భాగస్వాములు కానున్న ఆ సంస్థలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-09 16:09:14  IST  )

జాతీయ రహదారుల అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది...

రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భాగస్వాములు కానున్న ఆ సంస్థలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, సెక్యూరిటైజేషన్‌తో లాభాలు పొందవచ్చని, జాతీయ రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని జాతీయ రహదారుల అథారిటీ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు చేపడితే దేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంచేందుకు వీలు కలుగుతుందన్నారు. సోమవారం 'రహదారి రంగానికి ఆస్తి మానిటైజేషన్ వ్యూహ పత్రం(పోస్టర్) విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందన్నారు. జాతీయ రహదారుల ఆస్తుల విలువ పెంచడానికి టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (ToT), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (InvITలు), సెక్యూరిటైజేషన్ నమూనాల ద్వారా మూలధనాన్ని సమీకరించవచ్చన్నారు. వీటి ద్వారా నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద 6,100 కి.మీ.లకు పైగా జాతీయ రహదారులపై ₹1.4 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఆదాయ వనరులతో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, నిర్వహణ పద్ధతులు మెరుగుపడుతాయన్నారు.

ఈ భాగస్వామ్యంతో దేశానికి సంపన్న భవిష్యత్తు, ప్రపంచ స్థాయి హైవే నెట్‌వర్క్‌ను నిర్మించడానికి వీలుపడుతుందన్నారు. జాతీయ రహదారుల అథారిటీ రోడ్ల కనెక్టివిటీలో కీలక పాత్ర పోషిస్తూ, జాతీయ రహదారులను విస్తరించడం, మెరుగుపరచడంలో ముందుందన్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించడానికి, వేగవంతం చేయడానికి వినూత్న నిధుల విధానాలను అన్వేషించడం అత్యవసరం అన్నారు. భారతదేశ విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్, ముఖ్యంగా జాతీయ రహదారులు, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, మన మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న డిమాండ్లతో, వినూత్న నిధుల పరిష్కారాలను అన్వేషించడం చాలా అవసరమన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు నిర్దిష్ట కాలానికి లీజుకు ఇచ్చి మంచి లాభాలు ఆర్జించినట్లు చెప్పారు. ఆస్తి మానిటైజేషన్ ను ఆస్తి మూలధన పునర్వినియోగం అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే వ్యాపార పద్ధతి. ఇది పరిమిత కాల లైసెన్స్, ప్రభుత్వ రంగ ఆస్తిని ప్రైవేట్ రంగ సంస్థకు లీజుకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

Next Story