ఏపీకి ‘స్వావలంబని’ పథకాన్ని విస్తరించండి : ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

by Bhoopathi Nagaiah |

‘స్వావలంబని’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి, రాష్ట్రంలోని మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించాలని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఏపీకి ‘స్వావలంబని’ పథకాన్ని విస్తరించండి : ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
X

దిశ, చిత్తూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వావలంబని’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి, రాష్ట్రంలోని మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించాలని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం లోక్‌సభలో కేంద్ర నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖను ఉద్దేశించి ఆయన ఈ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో కేంద్ర పథకాలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రతిపాదనను ఉంచారు.

మహిళా సాధికారతే లక్ష్యం

మహిళలు స్వయం సమృద్ధిని సాధించేందుకు ‘స్వావలంబని’ వంటి పథకాలు ఎంతో దోహదపడతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల సంఖ్య, నమోదు చేసుకున్న విద్యార్థినుల వివరాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమ విస్తరణకు ఉన్న ప్రణాళికల గురించి ఆయన లిఖితపూర్వకంగా వివరణ కోరారు. ముఖ్యంగా మెంటర్‌షిప్, నిధుల విడుదల, నైపుణ్య అభివృద్ధి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి ఆయన ఆరా తీశారు.

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

ఎంపీ ప్రశ్నలకు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సానుకూలంగా స్పందిస్తూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 ఫిబ్రవరిలో అస్సాం, మేఘాలయ, మిజోరం, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరు ఉన్నత విద్యా సంస్థల్లో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. 1200 మంది మహిళా విద్యార్థులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడం... నైస్ బడ్, ఐఐఈ వంటి స్వయంప్రతిపత్త సంస్థల ద్వారా శిక్షణ.... ఆలోచన స్థాయి నుండి వ్యాపార స్థాపన వరకు బహుళ-స్థాయి శిక్షణ,ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఈ పథక లక్ష్యమని యన వివరించారు.

ఏపీకి విస్తరణపై పట్టు

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథక విస్తరణ ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని కేంద్రం తెలిపిన నేపథ్యంలో, ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మరోసారి గట్టిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలోని మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం చేకూర్చేందుకు ఈ పథకాన్ని తక్షణమే రాష్ట్రానికి విస్తరించాలని ఆయన కోరారు.

Next Story