ఆ అనుభవం మాకూ ఉంది.. శానసమండలిలో ప్రస్తావిస్తా: నాగబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-16 11:28:42  IST  )

శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్సీ నాగబాబు పరిశీలించారు....

ఆ అనుభవం మాకూ ఉంది.. శానసమండలిలో ప్రస్తావిస్తా: నాగబాబు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్సీ నాగబాబు పరిశీలించారు. వానాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని, సుదీర్ఘ కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని వినతి పత్రాల ద్వారా నాగబాబు దృష్టి స్థానిక ప్రజలు, జనసేన నాయకులు తీసుకెళ్లడంతో ఆయన గురువారం పర్యటించారు. బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రవికుమార్‌తో కలిసి ఆర్టీసీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడారు. బస్టాండ్ అభివృద్ధికి సాధ్యం అయ్యే అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 25 ప్లాట్ ఫాంలను 40కు పెంచి ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ నిర్మిస్తే ప్రయాణికులకు అనుకూలంగానూ, ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. లిఫ్టింగ్ పద్ధతిలో వరద నీటిని తోడి డ్రైనేజీలకు పంపే విధానంపై శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుగుణాకర్ వివరించారు. నగరానికి దగ్గరగా నూతన బస్టాండ్ నిర్మాణం కూడా ఒక మార్గంగా ఉటుందని శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రవికుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులతో కె. నాగబాబు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనుభవాలు తమకూ ఉన్నాయని, సాధ్యమయినంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. తక్షణ అనుకూలమైన పనులను నివేదిక రూపంలో అందిస్తే శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీగా సాధ్యమైనంత మేరకు శ్రీకాకుళం బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Next Story