ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి.. ‘కోవా బన్’ వ్యవహారంపై నాగబాబు ఆవేదన

by Ramesh Naini |

చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి.. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు.

ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి.. ‘కోవా బన్’ వ్యవహారంపై నాగబాబు ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడు వలీని కొందరు పనిగట్టుకుని మరీ భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆవేదన చెందారు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం కోవా బన్ అమ్ముకొనే వలీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి.. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. విచారణ పేరుతో ఒక నిరుపేదను అవమానించడం మంచిపద్ధతి కాదని, ఆంధ్రప్రదేశ్‌లోని క‌ర్నూలుకు చెందిన వలి మేడారం జాతరలో పదిరూపాయలకే కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంలో కొందరు వ్యక్తుల అత్యుత్సహం ఈ రోజు ఆ కుటుంబాన్ని పస్తులు పడుకోబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వలి లాంటి ఎందరో చిరు వ్యాపారులు..

వలి లాంటి ఎందరో చిరు వ్యాపారులు ఈ రోజు బయటకొచ్చి వ్యాపారం చేసుకోవడానికి భయపడుతున్నారని అన్నారు. అటువంటి వారందరిలో ధైర్యాన్ని నింపడానికి వలిని పిలిపించి మాట్లాడి ధైర్యాన్ని నింపామని అన్నారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయబద్ధంగా, నాణ్యమైన చిరుతిండి పదార్థాలు అమ్ముకునే చిరు వ్యాపారులను ఎవరైనా ఇబ్బంది పెడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలీస్ అధికారులు న్యాయంగా అమ్ముకునే చిరు వ్యాపారులకు సహాయంగా నిలవాలని కోరారు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం చిరువ్యాపారుల లక్ష్యం.. పెద్దగా మూలధనం లేకపోయినా, తమ కాళ్లపై తాము నిలబడాలని ఆలోచనతో కూడళ్లలో, ఎక్కువ జనసంద్రం ఉండే జాతర్లలో, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని చిరుతిండి పదార్థాలు అమ్ముకుని జీవనం సాగించేవారు మన దేశంలో కోట్ల మంది ఉన్నారని అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా ప్రజలు చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీదనే ఆధార పడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. నచ్చితే, చేతనైతే వారి వ్యాపారానికి చేయుతనిద్దామని, అంతేకానీ ఆరోపణలతో వారి కడుపు కొట్టడం మంచి సంస్కృతి కాదని అన్నారు.

Next Story