ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

by Thanuru Gopichand |

అవినీతిని సహించేది లేదని స్పష్టం చేస్తున్న ఎమ్మెల్యే.

ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ (Proddatur Municipality) అధికారులపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి (Nandyal Varadarajula Reddy) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా కారణంగా మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయిందని.. మున్సిపాలిటీ దోపిడీకి గురైందని ఆరోపించారు. రిటైర్ అయిన ఉద్యోగులు కూడా జీతాలు తీసుకుంటున్న వింత పరిస్థితి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నెలకొందన్నారు. మున్సిపల్ పెట్రోల్ బంకులు కోటి 23లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. దానితో పాటు గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు బాధ్యుతలపై మున్సిపల్ కమిషనర్ రవిచంద్రా రెడ్డి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. రిటైర్డు ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన వారిపై మున్సిపల్ ఆర్డీ చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అవినీతి విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.

తాను అభివృద్ధిని అడ్డుకుంటున్నానని కొందరు ఆరోపిస్తున్నారన్నారు. ఆ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు. కేవలం నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే నిలిపివేయించామని వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీలో పన్నులు సక్రమంగా వసూలు కావడం లేదన్నారు. 30 కోట్ల రూపాయల పన్నులు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఉన్న వైసీపీ చైర్మన్ ఒక ఆట బొమ్మ మాత్రమేనని విమర్శించారు. వెనుక నుంచి కథ నడిపేదంతా వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అని తెలిపారు. వారు ఇష్టానుసారం తీర్మానాలు చేస్తే అనుతులివ్వాలా అని విమర్శకులను ప్రశ్నించారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఖరాఖండిగా తేల్చేశారు.

Next Story