- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోయ ఆనంద్ హత్యను రుజువు చేస్తే చర్యలకు సిద్ధం: ఎమ్మెల్యే అమిలినేని
వైసీపీ నేత తలారి రంగయ్య ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ చౌకబారు రాజకీయాలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని మండిపడ్డారు..

దిశ, కళ్యాణదుర్గం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తలారి రంగయ్య ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ చౌకబారు రాజకీయాలకు తెరలేపుతున్నారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. బోయ ఆనంద్ హత్యపై “అగ్రవర్ణాలు చేశారు’’ అంటూ తమపై మోపిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన ఖండించారు. “హత్య కేసుకు సంబంధించి పోలీసుల నుంచి నోటీసులు వెళుతున్నా రంగయ్య తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నా ఇవ్వమని పోలీసులు అడిగితే మౌనంగా ఉంటాడు. చేతనైతే రుజువు చేయి’’ అంటూ ఎమ్మెల్యే సవాలు విసిరారు.
గతంలో చేసినట్లే ఇప్పటికీ రంగయ్య అసత్య ప్రచారంతో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. “భవిష్యత్తులో ఇలాంటి నిరాధార ఆరోపణలను సహించం’’ అని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ, గెలుపుకు కావాల్సిన సంఖ్యాబలం పూర్తిగా తమవైపే ఉందని ఎమ్మెల్యే తెలిపారు. “కౌన్సిలర్లు ఇక్కడే ఉన్నారు. ప్రలోభాలకు గురిచేస్తున్నది వైసీపీనే. టీడీపీలో క్యాంపు రాజకీయాలు లేవు’’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణికి టీడీపీ కండువా కప్పినట్లు పేర్కొన్నారు. “రంగయ్య వ్యవహారశైలే పార్టీ మారడానికి కారణం. ఎన్నికైన రోజునుంచి ఎక్కడా ఎమ్మెల్యే గారు కక్ష్యసాధింపు ధోరణి చూపలేదు. జరుగుతున్న అభివృద్ధి చూసి సహకరించేందుకు టీడీపీలో చేరుతున్నా’’ అని జయం ఫణి వెల్లడించారు. కళ్యాణదుర్గం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలువరించేందుకు వైసీపీ నేతలు అబద్ధ ఆరోపణలు చేయడం తగదని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని చెప్పారు.






