11 రోజులు.. జాహ్నవి జాడేది? సన్నగిల్లుతున్న ఆశలు!

by Naga Rani Yarlagadda |

గంటలు, వారంరోజులు, పదిరోజులు.. మరో నాలుగు రోజులైతే చిన్నారి జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి మిస్సై పక్షం రోజులవుతది.

11 రోజులు.. జాహ్నవి జాడేది? సన్నగిల్లుతున్న ఆశలు!
X

దిశ, వెబ్‌డెస్క్: గంటలు, వారంరోజులు, పదిరోజులు.. మరో నాలుగు రోజులైతే చిన్నారి జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి మిస్సై పక్షం రోజులవుతది. జూన్ 6వ తేదీన తండ్రి వెనకాలే.. నాన్నా నేనూ వస్తానంటూ వెళ్లిన జాహ్నవి, పాప వెనకే వెళ్లిన కుక్క మిస్సయ్యాయి. రాత్రయినా, తెల్లారినా ఇంటికి చేరుకోపోయేసరికి తల్లిదండ్రుల గుండె చెరువైంది. ఆ తల్లి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. పోలీసులను ఆశ్రయించారు. పాప జాడ కోసం వారు నివాసం ఉంటున్న ఐదెకరాల తోటంతా జల్లెడ పట్టారు. చివరికి ఓ కంచెకు పాప జుట్టు, కుక్క బొచ్చు అంటుకుని ఉండటాన్ని గమనించిన పోలీసులు.. ఏదో అపాయంలో ఉండి ఉంటారని భావించారు. లేదా కంచె దాటేటపుడైనా ఆ జుట్టు కంచెకు చిక్కుకుని ఉంటుందని అనుమానించారు. ఆ దిశగా అడవంతా వెతికినా ఫలితం లేదు.

మూసుకుపోయిన దారి..

జాహ్నవి, కుక్క మిస్సైన 5 రోజులకు.. కుక్క ఒక్కటే తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లగానే తల్లి భవాన్ని కొంగుపట్టుకుని లాగడంతో.. జాను ఇంటికొచ్చేస్తుందని ఆ తల్లి కళ్లు ఆనందంతో వెలిగిపోయాయి. కానీ.. జాను ఏదీ అంటే ఆ కుక్క మౌనంగా చూస్తుండిపోయింది. దీంతో కన్నకూతురికి ఏ అపాయం జరిగిందోనని తల్లిప్రాణం తల్లడిల్లింది. పాప జాడ కోసం వెతుకుతున్న పోలీసులకు పెంపుడు కుక్క ఆధారమైంది. దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి తోట, అడవిలోకి వదలగా.. 80 నిమిషాల పాటు 8 కిలోమీటర్లు తిరిగి వచ్చేసింది. మనుషులను చూస్తే భయపడటం, కరవడానికి మీదికి రావడంతో.. దానిని బోనులో ఉంచారు. మరోసారి ట్రాకర్ పెట్టి పంపేందుకు ప్రయత్నించగా.. వెళ్లేందుకు కుక్క మొరాయించింది. ఇంటికొచ్చిన మూడు రోజులకే కుక్క వింత ప్రవర్తనతో, తిండి తినలేక, మంచినీరు కూడా తాగలేక, దానిలో అదే కుమిలిపోతూ చనిపోయింది. అంతకుముందు రోజు.. జాను తల్లి భవాని.. కుక్కతో మాట్లాడుతూ జాను ఎక్కడుందో తెలుసా? వెళ్లి తీసుకువస్తావా? అని అడుగుతుంటే.. ఆ శునకం ఊ కొడుతూ బదులిచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్లచే కన్నీళ్లు పెట్టించింది. జాహ్నవి ఆచూకీని కనుగొనేందుకు పోలీసులకు దొరికిన ఒక్కగానొక్క ఆధారం చనిపోవడంతో.. ఉన్న దారి కూడా మూసుకుపోయినట్లైంది.

కుక్క ఎందుకు చనిపోయింది? దానిపై ఎవరైనా దాడి చేశారా? అంత వింతగా ఎందుకు ప్రవర్తించింది? పాపకు పెంపుడు కుక్కే హాని తలపెట్టి ఉంటుందా? ఇలా చాలా సందేహాలు పోలీసుల ముందున్నాయి. వీటన్నింటికీ కుక్క పోస్టుమార్టం రిపోర్టే సమాధానం కానుంది. రేపో, ఎల్లుండో ఆ రిపోర్ట్ రానుంది. కాగా.. జాహ్నవిని ఎవరైనా చూసినా, ఆచూకీ తెలిసినా సమాచారం ఇస్తే లక్షరూపాయలు బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయినా ఇంతవరకూ ఎలాంటి కాల్ రాకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా నైట్ ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లతో అడవిని జల్లెడపట్టిన పోలీసులు.. అక్కడ క్రూరమృగాల కదలికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు.

జ్యోతిష్యుడు చెప్పిందే జరుగుతుందా?

మరోవైపు జాహ్నవి మిస్సింగ్ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పాప మిస్సింగ్ పై పోలీసుల ద్వారా అన్ని విషయాలను తెలుసుకున్నారు. మరింత ఫోర్స్ ను పాపను వెతికేందుకు రంగంలోకి దించారు. NDRF, SDRF కూడా పాప జాడకోసం వెతుకుతున్నాయి. 5 ఎకరాల తోట, దాని చుట్టూ అడవి. అధునాతన టెక్నాలజీతో తయారైన డ్రోన్లు, సీసీ కెమెరాలు, పోలీసు జాగిలాలు, చుట్టూ సెల్ టవర్ల పరిధిలో ఉన్న లక్షల ఫోన్ల తనిఖీలు, అన్నీ చేసినా.. 11 రోజులుగా జాను ఏమైందన్నదానిపై ఒక్క విషయం కూడా తెలియకపోవడం కలచివేస్తోంది. ఇదిలా ఉంటే.. పాప కచ్చితంగా ఇంటికి వస్తుందని స్థానిక జ్యోతిష్యుడు చెప్పడంతో బంధువులు, సన్నిహితులంతా జాను ఇంటికి వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఒక దిక్కలో జాను వెళ్లినట్లుగా తెలుస్తుందని, ఆ దిక్కువైపు వెతికితే ఆచూకీ దొరుకుతుందని అతని చెప్పిన విషయాలు కూడా వైరల్ అయ్యాయి. కానీ.. కొందరు ఇలాంటి వాటిని క్యాష్ చేసుకునేందుకు అలా చెప్తారని, ఆ జ్యోతిష్యుడి మాటలు నమ్మొద్దని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.

ఆ కామెంట్ లో నిజమెంత?

నిన్నటికి నిన్న (సోమవారం) ఓ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్సులో జీసస్ అనే అనే ఐడీతో ఓ వ్యక్తి.. జానును ఓ వృద్ధ దంపతులు తీసుకెళ్తుంటే చూశానని కామెంట్ చేసినట్లు ఓ యువతి వెలుగులోకి తీసుకొచ్చింది. చివరిగా తాను రాజమండ్రిలో చూశానని ఆ వ్యక్తి కామెంట్ చేసినట్లు తన అక్క చెప్పగా.. ఆ విషయాన్ని తాను అందరికీ చేరవేసే ప్రయత్నం చేస్తున్నానని తెలిపింది. నిజంగానే అతను జానుని చూశాడా? లేక ఆకతాయితనంగా కామెంట్ చేశారా? చూసి ఉంటే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఏ వీడియో కింద ఆ కామెంట్ వచ్చింది ? పోలీసులు ఆ ఐడీ ఆధారంగా సదరు వ్యక్తిని కనుగొంటారా? నిజంగానే జానును రాజమండ్రి వైపు తీసుకెళ్తే.. పోలీసులు నగరంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే పాప ఆచూకీ దొరికే అవకాశం ఉంటుంది. దానిపై పోలీసులు ఏ స్టెప్ తీసుకుంటారు? కుక్క పోస్టుమార్టం రిపోర్టులో ఏం వస్తుంది? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా.. ఆ పసిప్రాణానికి ఏ హానీ జరగకుండా.. క్షేమంగా ఇంటికి తిరిగివస్తే చాలు అని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story