హాస్టళ్ల మెనూలో కక్కుర్తి.. వార్డెన్లకు మంత్రి సవిత హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు...

హాస్టళ్ల మెనూలో కక్కుర్తి.. వార్డెన్లకు మంత్రి సవిత హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని సంక్షేమ శాఖ అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. గుంటూరు ఏపీఎన్జీవో కల్యాణ మండపంలో జిల్లాల బీసీ సంక్షేమ, సహాయ అధికారులు, వసతి గృహా సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో డైట్ మెనూ అమలు, మంచినీటి సరఫరా, వార్డెన్ల పని తీరుపై పబ్లిక్ పెర్సెప్షన్‌లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, పని తీరు మార్చుకోవాలని సూచించారు. కొంతమంది సంక్షేమ అధికారుల నిర్లక్ష్యమైన పనితీరు వల్ల మొత్తం శాఖకే చెడ్డ పేరు తెస్తుందని మంత్రి సవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రి సవిత హెచ్చరిక

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి సవిత హెచ్చరించారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా పర్యవేక్షించాలని, డైట్ ఖచ్చితంగా అమలు చేయాలని, సురక్షితమైన తాగునీరు అందించాలన్నారు.. విద్యార్థులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమని, పిల్లలకు పెట్టే మెనూలో కక్కుక్తి పడితే సహించేదిలేదని హెచ్చరించారు. సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించి తక్షణమే చర్యలు తీసుకునేలా సూచనలు అందిస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. విద్యార్థుల భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు పునాదివేసేలా తీర్చిదిద్దెందుకు సంక్షేమ అధికారులు కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

Next Story