ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేశ్ భేటీ..'అమరావతి బిల్లు' ఆమోదంపై కృతజ్ఞతలు

by Malleboina Mahesh |

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేశ్ భేటీ! అమరావతి బిల్లు ఆమోదంపై కృతజ్ఞతలు. రైతుల త్యాగాలను వివరించిన లోకేశ్. రాజధాని అభివృద్ధికి కేంద్రం మద్దతు కోరిక.

ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేశ్ భేటీ..అమరావతి బిల్లు ఆమోదంపై కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో 'అమరావతి పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026' విజయవంతంగా ఆమోదం పొందిన నేపథ్యంలో, కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆయన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చారిత్రాత్మక బిల్లు ద్వారా అమరావతిని రాష్ట్ర ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు ప్రధానిని శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమరావతి రైతుల అసాధారణ పోరాటాన్ని లోకేశ్ ప్రధానికి వివరించారు. తమ భూములను స్వచ్ఛందంగా పూలింగ్‌కు ఇచ్చి, ఐదేళ్ల పాటు అనిశ్చితిలోనూ పట్టువదలకుండా పోరాడిన వేలాది మంది రైతుల త్యాగాలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. ఆ రైతుల ఆశయాలకు అనుగుణంగా అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతునివ్వాలని కోరారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి బిల్లు ఆమోద ప్రక్రియలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా లభించడంతో ఏపీ అభివృద్ధి ఇక అప్రతిహతంగా సాగుతుందని లోకేశ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story