- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి లోకేశ్ బిగ్ అలర్ట్.. సిద్ధంగా ఉండాలని ఆదేశం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు....

దిశ, వెబ్ డెస్క్: తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుపాను(Montha Cyclone) కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండని తెలిపారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలన్నారు. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. తుపాను ప్రభావిత తీరప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలన్నారు. భారీవర్షాల కారణంగా ఎటువంటి అంటురోగాలు ప్రబలకుండా వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్‌లు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు. కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాల కారణంగా చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పంటపొలాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఆయిల్ మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మొంథా తుపాను పరిస్థితులను గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తుపాను బాధితులకు ఎటువంటి సాయం అవసరమైన వెంటనే స్పందించేందుకు యంత్రాంగం 24×7 సిద్ధంగా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.






