ఏపీలో తుపాను నష్టం రూ. 6,352 కోట్లు.. అమిత్ షాకు నివేదిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-02 08:55:32  IST  )

ఏపీలో జరిగిన మొంథా తుపాను నష్టంపై కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి లోకేష్ నివేదిక అందించారు..

ఏపీలో తుపాను నష్టం రూ. 6,352 కోట్లు.. అమిత్ షాకు నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన మొంథా తుపాను కారణంగా అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి మొంథా తుపాను నష్టంపై నివేదికను అందజేశారు. మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని మంత్రి లోకష్ తెలిపారు.. అక్టోబర్ 28న రాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటిందని, ఆ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులతో భారీవర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అప్రమత్తమై 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించింది. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు, ఇతర వస్తువులను అందించింది. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3వేలు అందించాం. ఇదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టింది. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి. ఈనెల 12వ తేదీన తాము సమర్పించిన నివేదికపై కేంద్రమంత్రుల బృందం (IMCT) ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపింది.’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Next Story