ఉగాది వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మరింత విజయవంతంగా ముందుకు సాగేలా ఆ దైవ ఆశీస్సులు ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు...

ఉగాది వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మరింత విజయవంతంగా ముందుకు సాగేలా ఆ దైవ ఆశీస్సులు ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి పాల్గొన్నారు.

సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం

ఘనాపాటి విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం వేద పండితులను సన్మానించారు. ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను అభినందించారు.

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఉగాది వేడుకలు నిదర్శనం

‘‘తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఉగాది వేడుకలు నిదర్శనం. పంచాంగం అనేది మన దేశ సంస్కృతి, మన విజ్ఞానానికి జ్ఞాపిక. భవిష్యత్తును ముందుగానే ఊహించి, ఆ మేరకు రైతులను అప్రమత్తం చేయడం మన పూర్వీకుల ప్రతిభకు నిదర్శనం. పవిత్రమైన భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ నడచుకోవాలి.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలి

‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలి. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం. అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది. వచ్చే ఉగాది నాటికి బందరు పోర్టును పూర్తి చేసుకుంటాం. పోర్టు పూర్తైతే స్థానికంగా వందలాది పరిశ్రమలు వస్తాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే.. భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుంది.’’ అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

అత్యంత సంతోషం

‘‘ఉగాది వేడుకలను భక్తులతో కలిసి నిర్వహించుకోవడం అత్యంత సంతోషంగా ఉంది. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా ఆ దేవదేవుడు ఆశీర్వదించాలి. నూతన సంవత్సరం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మచిలీపట్నం నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు దైవ ఆశీస్సులు తోడుండాలి.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర కోరుకున్నారు.

Next Story