అతిపెద్ద బీచ్ ఫెస్టివల్‌.. విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభం.. మంత్రి సందడి

by Ramesh Naini |

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్‌ను శనివారం ప్రారంభించారు.

అతిపెద్ద బీచ్ ఫెస్టివల్‌.. విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభం.. మంత్రి సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభించి, అందులో ప్రయాణించి సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ విశాఖపట్నం సముద్రతీరాలు, కొండలు, నగర సౌందర్యాన్ని ఆకాశ మార్గం నుంచి వీక్షించే ఈ అవకాశం ప్రతి సందర్శకుడికి ఒక మరపురాని అనుభవం అవుతుందన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్ తదితరులతో కలిసి హెలికాప్టర్ రైడ్‌లో ప్రయాణించి నగర అందాలను తిలకించామని తెలిపారు.

ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా విశాఖ ఉత్సవ్‌ను దేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్‌గా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. విశాఖ ఉత్సవ్‌కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ రైడ్‌తో పాటు పారామోటరింగ్, స్కూబా డైవింగ్, పారా సెయిలింగ్, కయాకింగ్ వంటి అడ్వెంచర్ సేవలను వినియోగించుకుని విశాఖ అందాలను ఆస్వాదించాలని మంత్రి కోరారు.

Next Story