విశాఖ రుషికొండ బీచ్ సుందరీకరణ పై మంత్రి దుర్గేష్ స్పెషల్ ఫోకస్

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ పై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు.

విశాఖ రుషికొండ బీచ్ సుందరీకరణ పై మంత్రి దుర్గేష్ స్పెషల్ ఫోకస్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ పై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. కలకాలం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇవే గాక రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ బీచ్ క్లీన్‌గా ఉండేలా మంత్రి దుర్గేష్(Minister kandula durgesh) చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో పర్యాటకులు అధికంగా వచ్చే ఆర్ కే బీచ్ లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై స్థానిక అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. బీచ్‌‌లో సుందరీకరణకు పెద్దపీట వేయాలని ఇప్పటికే పర్యాటక శాఖ తరపున రూ.24 లక్షలు కేటాయించిన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ క్షేత్రస్థాయి సందర్శన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. బీచ్ తీర ప్రాంతంలో తరుచూ సముద్రపు వ్యర్థాలు, మురుగు సముద్రంలో కలవకుండా నాలా అవుట్ ఫాల్స్ ను గుర్తించి తొలగింపుకు తగు చర్యలు తీసుకునేందుకు కమిటీ పనిచేస్తోంది. పర్యాటకులు కేవలం బీచ్‌ల సందర్శనకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శించేలా టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరగడం విశేషం. ఈ విషయంలో పర్యాటక శాఖతో పాటు వివిధ శాఖల అధికారుల కృషి ప్రశంసనీయం. ప్రతిష్టాత్మక బీచ్ పై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ఖ్యాతిని పాడు చేస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు పాత ఫోటోలు జత చేసి బీచ్ లో పరిశుభ్రత లోపించిందన్న సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదని తెలిపారు.

Next Story