రుషికొండ ప్యాలెస్ పై మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

by Thanuru Gopichand |

విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ (Rishikonda Palace) పై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు.

రుషికొండ ప్యాలెస్ పై మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ (Rishikonda Palace) పై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ రెండో సమావేశానికి హాజరయ్యారు. అమరావతిలో మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో రుషికొండ ప్యాలెస్ భవిష్యత్ వినియోగంపై విస్తృతంగా చర్చించారు.

ఈ విషయమై మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని పేర్కొన్నారు. అటువంటి వాటిల్లో ఖర్చుల్లో భాగంగా రుషికొండపై ప్యాలెస్ ను నిర్మించిందన్నారు. ప్రతి నెలా రుషికొండ ప్యాలెస్ నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా నిర్వహణ భారంగా మారుతోందని తెలిపారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావాలని సబ్ కమిటీ సమావేశంలో చర్చించామన్నారు. తద్వారా ప్రజాధనానికి న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇదే విషయమై మరోసారి సమావేశం కానున్నాం అన్నారు. ఆ తరువాత స్పష్టమైన ప్రతిపాదనలను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.

రుషికొండ ప్యాలెస్ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆశిస్తున్నాం అన్నారు. అదే విధంగా పర్యాటక శాఖకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ఎలా వినియోగించాలనే అంశంపై ప్రజలు, స్టేక్ హోల్డర్స్ నుంచి వచ్చిన అభిప్రాయాలను సమీక్షించామన్నారు. హోటల్, రిసార్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, వెల్‌నెస్ సెంటర్, మైస్ సెంటర్ వంటి పలు వినియోగ అవకాశాలపై చర్చించి, సంస్థల సామర్థ్యం, ప్రజల అవసరాలు, ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు.

Next Story