జగన్ వార్నింగ్ చూస్తే నవ్వొస్తుంది: మంత్రి ఆనం సెటైర్

by Gantepaka Srikanth |

మత్స్యకారుల కడుపు కొట్టిన పెత్తందారుడు జగన్ మోహన్ రెడ్డేనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

జగన్ వార్నింగ్ చూస్తే నవ్వొస్తుంది: మంత్రి ఆనం సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మత్స్యకారుల కడుపు కొట్టిన పెత్తందారుడు జగన్ మోహన్ రెడ్డేనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గం, జువ్వలదిన్నె మత్స్యకారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన జగన్ మోహన్ రెడ్డి, ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడకు వచ్చారని మంత్రి ప్రశ్నించారు. గత 15 రోజులుగా వస్తాను, వస్తాను అని చెబుతూ చివరకు అక్కడి జిల్లా వైసీపీ నాయకులు బలవంతంగా తీసుకువచ్చిన పరిస్థితి ఏర్పడింది. కారణం.. స్థానిక మత్స్యకారులు, వారి కుటుంబాలు ఏ పరిస్థితుల్లోనూ వైసీపీ నాయకత్వాన్ని విశ్వసించని స్థితికి చేరుకున్నారు. మూడు నాలుగు సార్లు పిలిచినా “మా ప్రాంతానికి రావద్దు” అని జగన్‌ను తిరస్కరించిన పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. చివరికి బతిమాలి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారే తప్ప, ప్రజల్లో ఆదరణతో వచ్చిన పర్యటన కాదు.

ఆ ఏర్పాట్లు కూడా నిలిచిపోయాయి..

అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ప్రజల సమస్యలపై చర్చ చేయకుండా, కేవలం నిందారోపణలు, పరుష వ్యాఖ్యలు మాత్రమే చేశారు. ఇది ఆయన రాజకీయ ధోరణికి నిదర్శనం. ఎన్నికలకు ముందు పూర్తి కాని ప్రాజెక్టులను కూడా “జాతికి అంకితం చేశాను” అని ప్రకటించడం ఆయన పాలనలో సాధారణంగా మారింది. వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గర కూడా అదే జరిగింది.. ప్రారంభించానని చెప్పినా నీటి చుక్క కూడా రాలేదు. ఇంకా వేల కోట్లు ఖర్చు చేస్తేనే పూర్తి అవుతుంది. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ దగ్గర కూడా తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి “నేనే నీళ్లు ఇచ్చాను” అని ప్రచారం చేసి, ఆయన వెళ్లిన వెంటనే ఆ ఏర్పాట్లు కూడా నిలిచిపోయాయి.

నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ..

అలాగే జువ్వలదిన్నె హార్బర్‌ను కూడా పూర్తి చేయకముందే వర్చువల్‌గా ప్రారంభించానని ప్రకటించారు. కానీ వాస్తవానికి నీటి సదుపాయం లేదు, విద్యుత్ లేదు, నిల్వ గోదాములు లేవు. ఇవేవీ పూర్తి చేయకుండా 2024 మార్చిలో ఎన్నికలకు మూడు నెలల ముందు హడావుడిగా ప్రారంభించి మత్స్యకారులకు అంకితం చేశానని చెప్పడం పూర్తిగా మోసం. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌పై కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే విమర్శించడం ద్వంద్వ వైఖరి. ఇప్పుడు మా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ఒక భాగంగా కొంతభూమిని డిఫెన్స్ టెక్నాలజీ సంస్థకు ఇచ్చి, ఆ సంస్థ ద్వారా అభివృద్ధి చేసి స్థానిక మత్స్యకార కుటుంబాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ జగన్ దీనిని కూడా తప్పుగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మత్స్యకారులు “మా ప్రాంతానికి రావద్దు” అని చెప్పినా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం ఆయన రాజకీయ లక్ష్యాన్ని బయటపెడుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే, ఆయన మాత్రం ఆ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులను కూడా విమర్శించడం బాధాకరం. ఈ హార్బర్‌ను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేశారనే ఆరోపణలు పూర్తిగా అబద్ధం. కేవలం 7 ఎకరాలు మాత్రమే టెక్నాలజీ అభివృద్ధి కోసం ఇచ్చాం. దీని వల్ల మత్స్యకారులకు డ్రోన్ సర్వేలు, శాటిలైట్ టెక్నాలజీ, సముద్ర భద్రత, చేపల వనరుల అంచనా వంటి ఆధునిక సదుపాయాలు అందుతాయి. ఇది మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే కార్యక్రమమని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

జగన్ వార్నింగ్‌లు ఇవ్వడం పూర్తిగా హాస్యాస్పదం..

నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం మత్స్యకారుల భవిష్యత్తు కోసం పనిచేస్తోంది. కానీ జగన్ మాత్రం అలజడి సృష్టించి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారు. జగన్ వార్నింగ్‌లు ఇవ్వడం పూర్తిగా హాస్యాస్పదం. ఆయన పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలిచింది. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలో కూడా ఎక్కువసేపు ఉండలేకపోయిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వడం విచిత్రం. నారా చంద్రబాబు నాయుడు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. అలాంటి వ్యక్తికి వార్నింగ్ ఇవ్వడం ఆయన స్థాయికి మించిన మాట. ప్రజలు ఇప్పటికే జగన్‌కు గుణపాఠం చెప్పారు, అవసరమైతే మళ్లీ చెబుతారని ఆనం హెచ్చరించారు.

గన్ కల్చర్..

జగన్ పాలనలో గన్ కల్చర్ పెరిగింది. కాల్పుల్లో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు ఇప్పటికీ బాధతో స్మారక స్తూపాలు నిర్మించుకుని జీవిస్తున్నారు. ఆ బాధను మరిచిపోలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితులను సరిచేసి వారికి భరోసా ఇస్తోంది. జగన్ పాలనలో భూసేకరణ చేయలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రామాయపట్నం పోర్ట్ వంటి ప్రాజెక్టులు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. వెలుగొండ ప్రాజెక్ట్, ఎయిర్‌పోర్ట్ భూసేకరణ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంతో సంతోషంగా ఉన్నారు. అలాంటి ప్రాంతంలో జగన్ వచ్చి అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు సహనంతో ఉన్నా సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారు. జగన్ తన తప్పులను అంగీకరించి క్షమాపణ చెప్పాల్సింది. కానీ అది చేయకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం సరైంది కాదు. జువ్వలదిన్నె హార్బర్ వద్ద నిలబడి మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలి. జగన్ బెంగళూరులో ప్యాలెస్‌లో ఉండి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల మధ్యకు రావడం లేదు. ప్రజల జీవితాలను అర్థం చేసుకోలేని నాయకుడిగా మారిపోయారు. పబ్‌జీ గేమ్‌లు ఆడుతూ కాలక్షేపం చేసే నాయకుడిగా విమర్శించారు. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్‌కు చోటు లేదు. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టింది. ప్రజల భవిష్యత్తు కోసం పని చేస్తోంది. చివరగా, జగన్ ఇకపై నెల్లూరు జిల్లాలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరిస్తూ, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, భవిష్యత్తులో మరింత గట్టిగా స్పందిస్తారని పేర్కొన్నారు.

మావి గన్ కావాలా?..

జగన్ అజెండా పూర్తిగా “గన్ కల్చర్” చుట్టూనే తిరుగుతోందని విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి కు అభివృద్ధి, సంక్షేమం కంటే “గన్ రాజకీయాలే” ముఖ్యమని పేర్కొన్నారు. “మావి గన్ కావాలా?” అని ప్రశ్నిస్తూ, “మా దృష్టిలో అది కాదు — ఆయనకు కావాల్సింది గన్నే” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ పేరులోనే “గన్” ఉందని, అదే ఆయన రాజకీయాల ప్రతిబింబమని విమర్శించారు. ఇంకా తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ, “జగన్నాథ రథ చక్రాల్లా ప్రజాస్వామ్యం ముందుకు దూసుకెళ్తోంది. ఆ రథ చక్రాల కింద ఈ గన్ రాజకీయాలు నలిగి ముక్కలు ముక్కలు అవుతాయి. ఆ గన్నులు చివరకు భూగర్భంలో, సముద్ర గర్భంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది” అని అన్నారు. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్‌కు స్థానం లేదని, ప్రజాస్వామ్య శక్తి ముందు అలాంటి రాజకీయాలు నిలవవని స్పష్టం చేశారు.

Next Story