రేపు ఏపీకి బిల్ గేట్స్.. సీఎం, మంత్రులతో కీలక చర్చలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-15 15:49:26  IST  )

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ రేపు తన టీమ్ తో సహా ఏపీకి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులతో కీలక చర్చలు నిర్వహించనున్నారు.

రేపు ఏపీకి బిల్ గేట్స్.. సీఎం, మంత్రులతో కీలక చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రేపు ఆంధ్రప్రదేశ్ కు విచ్చేయనున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు తన టీమ్ తో కలిసి వస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ లతో ప్రధానంగా సమావేశమవ్వనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ ఏపీ సచివాలయానికి చేరుకుంటారు.

తొలుత రియల్ టైమ్ గవర్నెర్స్ సొసైటీ (RTGS)కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈసందర్భంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు గురించి బిల్ గేట్స్ కు వివరించనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై ప్రధానంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్రవిజన్ 2047 లక్ష్యాల సాధనకు చేపట్టిన సంస్కరణలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, మెడ్ టెక్ వంటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు.. బిల్ గేట్స్ కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సమావేశం అనంతరం బిల్ గేట్స్ అండ్ టీమ్ ఉండవల్లి వ్యవసాయ క్షేత్రంలో టెక్నాలజీతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనున్నారు. మంత్రులు, కార్యదర్శులతో జరిగే బిల్ గేట్స్ సమావేశానికి అన్నిశాఖల కార్యదర్శులు హాజరు కావాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story