సభకు రాని సభ్యులు వేతనాలు తీసుకుంటున్నారు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

by Thanuru Gopichand |

ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల జవాబుదారీతనంతో ఉండాలి.

సభకు రాని సభ్యులు వేతనాలు తీసుకుంటున్నారు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
X

దిశ, వెబ్ డెస్క్: సభకు రాని సభ్యులు వేతనాలు.. జీత భత్యాలు తీసుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Assembly Speaker Ayyannapatrudu) అన్నారు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అఖిలభారతీయ అసెంబ్లీ స్పీకర్ల 86వ మహాసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల పట్ల శాసనసభ జవాబుదారీతనం అనే అంశంపై స్పీకర్ ప్రసగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు చట్టసభలకు ఎన్నికైన సభ్యులు అసలు సభకు రారని పేర్కొన్నారు. కానీ జీతభత్యాలు మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకుంటారని విమర్శించారు. అటువంటి అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలమని ప్రశ్నించారు. అనైతిక ప్రవర్తన వల్ల ప్రజల దృష్టిలో ప్రజాప్రతినిధులు చులకన కాకుండా ఉంటారా అని అడిగారు. అటువంటి సభ్యుల వ్యవహార శైలిని నిషేధించే నిబంధనలేవీ లేవన్నారు. చట్టసభ సభ్యులకు కూడా నోవర్క్- నోపే నిబంధన తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. సభకు రాని సభ్యులను రైట్ టు రీకాల్ చేసేలా చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీలో కొందరు ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పటి నుంచి అసెంబ్లీకి రావట్లేదన్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదని తెలిపారు. సభకు రాని సభ్యులు కూడా వేతనాలు, భత్యాలు తీసుకుంటున్నారని చెప్పారు. అటువంటి వారిని చూసినప్పుడు మనసుకు వేదన కలుగుతోందన్నారు.

Next Story