- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్లు, కండక్టర్లకు ఏటా రెండుసార్లు వైద్య పరీక్షలు.. ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకుంది...

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి, ఇతర ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి చేస్తూ సంస్థ చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.
సంస్థలో ఏడాది కాలంలో సుమారు 300 మంది ఉద్యోగులు మరణించడం ఆందోళనకరంగా మారడంతో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాల సుబ్రమణ్యం దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రైవర్లు, కండక్టర్లలో పెరుగుతున్న మరణాల రేటును దృష్టిలో ఉంచుకుని పలుమార్లు సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు ఇది అమలు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించిన ఆరోగ్య భద్రత అవగాహన సదస్సులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిస్పెన్సరీలు, ఆసుపత్రుల ద్వారా ప్రతి ఉద్యోగికి వైద్య పరీక్షలు ప్రారంభించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లలో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో, రోజువారీగా దీర్ఘ దూరాలు ప్రయాణించే ఈ వర్గం ఆరోగ్య సంరక్షణ అత్యవసరమని అధికారులు వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) జీవి రవి వర్మ మాట్లాడుతూ ముందస్తు వైద్య పరీక్షల ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమని తెలిపారు.
సీనియర్ మెడికల్ ఆఫీసర్ అమృతవల్లి మాట్లాడుతూ చాలా మంది ఉద్యోగులు ముందస్తు పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల వ్యాధులు ఆలస్యంగా గుర్తించబడుతున్నాయని చెప్పారు. దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, డ్రైవర్లకు నిర్వహించే పీరియాడికల్ పరీక్షల్లో రక్త పరీక్షలను కూడా చేర్చే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. అదేవిధంగా, సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్ఏ, సిఏఓ ఎన్. సుధాకర్ రావు తెలిపారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం తగిన బీమా పాలసీలను తీసుకోవాలని సూచిస్తూ, తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉన్న ఎస్బీఐ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను పరిశీలించాలని అధికారులు సూచించారు. అలాగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పాటిస్తూ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉద్యోగులను కోరారు.
ఉద్యోగుల ఆరోగ్యం సంస్థ అభివృద్ధికి కీలకమని, ఈ చర్యలతో ఆరోగ్యకరమైన, సురక్షితమైన రవాణా సేవలను అందించడంలో ఏపీఎస్ ఆర్టీసీ మరింత ముందుకు సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.






