బీసీ హాస్టల్ విద్యార్థుల రక్షణకు చర్యలు : మంత్రి సవిత

by Thanuru Gopichand |

మొంథా తుఫాన్ నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.

బీసీ హాస్టల్ విద్యార్థుల రక్షణకు చర్యలు : మంత్రి సవిత
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాన్ నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. తుఫాన్ తీవ్రంగా (Cyclone) ఉండే ప్రాంతాల్లోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టంచేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (Tadepalli Camp Office) బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, ప్రిన్సిపాళ్లు 24 గంటలూ (24 Hours) హాస్టళ్లలో ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే అందివ్వాలని స్పష్టం చేశారు. తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ (Electricity) కోతలు ఉండే అవకాశముందని, ఇన్వర్టర్లను పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. టార్చిలైట్లు, క్యాండిల్స్, అగ్గి పెట్టెలను పెద్ద మొత్తంలో ముందు జాగ్రత్తగా సమకూర్చుకోవాలన్నారు.

విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Center) వైద్యులతో చికిత్స చేయించాలన్నారు. హాస్టళ్లతో పాటు పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని సూచించారు. దోమలు చొరబకుండా హాస్టళ్ల గదుల కిటికీల వద్ద మెష్ లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నివేదిక (Health Report) ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్ల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.

Next Story