నాసా శాస్త్రవేత్తల పేరిట.. భారీ రైస్ పుల్లింగ్ స్కామ్

by Naga Rani Yarlagadda |

నాసా శాస్త్రవేత్తల పేరిట కొందరు నేరస్తులు భారీ రైస్ పుల్లింగ్ కు తెరతీశారు. ఈ ఘరానా మోసం నూజివీడులో వెలుగుచూసింది.

నాసా శాస్త్రవేత్తల పేరిట.. భారీ రైస్ పుల్లింగ్ స్కామ్
X

దిశ ప్రతినిధి, ఏలూరు : అమాయక ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న కొందరు నేరస్తులు ‘రైస్ పుల్లింగ్’ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష రూపాయలు ఇస్తే ఏకంగా కోటి రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో కలకలం రేపుతోంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన బాధితుల్ని చంపుతానని నేరస్తులు బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

నూజివీడుకు చెందిన దాచేపల్లి శ్రీనివాసరావు, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి పాస్టర్ రేపాని ప్రసన్నకుమార్ ద్వారా సుమారు 25 మంది బాధితులను రైస్ పుల్లింగ్ పేరిట మోసం చేశారు. “గోదాముల్లో వందల కోట్ల విలువైన రైస్ పుల్లింగ్ సామగ్రి ఉంది. అమెరికాలోని నాసా నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు వీటిని పరీక్షించి కొనుగోలు చేస్తారు” అంటూ ఫొటోలు చూపించి వారిని మభ్యపెట్టారు. ఈ మాయమాటలు నమ్మిన ఆరేపల్లి రవి, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, పిల్లి మోహనరావు వంటి బాధితులు తమ ఇళ్ల పత్రాలను కూడా తాకట్టు పెట్టి మరీ నిందితులకు నగదు అప్పగించారు. వీరంతా కొంతకాలం వేచి చూసినా ఫలితం లేకపోవడంతో బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని నిందితులను నిలదీశారు. నిందితులు డబ్బులు ఇవ్వకపోగా, బాధితులను “చంపేస్తాం” అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ఈ ఆర్థిక మోసం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక బాధితుల కుటుంబాల్లో ఇద్దరు వ్యక్తులు మనస్తాపంతో మరణించినట్లు సమాచారం. ఈ మరణాలు నిజమా? కాదా? అనేందుకు ధ్రువీకరణ లేదు.

పరిచయస్తుల ద్వారా వల..

నిందితులు చాకచక్యంగా పరిచయస్తుల ద్వారానే ఈ నెట్‌వర్క్ నడిపి అందరినీ నిలువునా ముంచేశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు తప్పించుకుని అమెరికా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నూజివీడు పట్టణ సీఐ సత్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి తరలించారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రజలు ఇలాంటి అత్యాశకు గురిచేసే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story