ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో మాస్ కాపీయింగ్.. కాపీ కొడుతూ దొరికిన 20 మంది మెడికోలు

by Ramesh Naini |

ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న విద్యార్థులు సీసీ కెమెరాల కళ్లకు అడ్డంగా దొరికిపోతున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో మాస్ కాపీయింగ్.. కాపీ కొడుతూ దొరికిన 20 మంది మెడికోలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న విద్యార్థులు సీసీ కెమెరాల కళ్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు జనవరిలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ ద్వారా అధికారులు అక్రమాలకు చెక్ పెడుతున్నారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ పరీక్షల్లో 20 మంది విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు.

మొత్తం 540 కెమెరాలు ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కళాశాలల్లో మొత్తం 540 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది విద్యార్థుల కదలికలను పరిశీలిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే అబ్జర్వర్లకు సమాచారం అందించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.

హైటెక్ కాపీయింగ్.. రెండేళ్లు డీబార్?

ఏప్రిల్ 2 నుంచి జరుగుతున్న పరీక్షల్లో ఇప్పటి వరకు 14 మంది అబ్బాయిలు, 6 గురు అమ్మాయిలు పట్టుబడ్డారు. వీరిలో 16 మంది చీటీలు (స్లిప్పులు) ద్వారా, ఇద్దరు స్మార్ట్ వాచీల సాయంతో, మరో ఇద్దరు సెల్ ఫోన్ల ద్వారా కాపీయింగ్‌కు యత్నించి దొరికిపోయారు. మంగళవారం నాటి పరీక్షలో ఇద్దరు హోమియో, ఒక ఆయుర్వేద విద్యార్థి కూడా చిక్కారు. పట్టుబడిన విద్యార్థుల కేసులను ఒక ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోంది. తప్పు తీవ్రతను బట్టి వీరికి గరిష్టంగా రెండేళ్ల వరకు డీబార్ విధించే అవకాశం ఉంది.

ఇన్విజిలేటర్లపైనా కొరడా

ఇద్దరు ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రంలో ఫోన్లు వాడుతూ కెమెరాల కంట పడ్డారు. వీరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, రాబోయే మూడేళ్ల పాటు వారిని పరీక్షల విధులకు దూరం చేసే యోచనలో ఉన్నారు. ఈ పరిణామాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరగకూడదని, పారదర్శకత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో కాపీయింగ్ రాయుళ్ల గుట్టు రట్టవుతుండటం, దేశంలో కర్ణాటక తర్వాత ఈ తరహా పారదర్శకత ఏపీలోనే అమలు కావడం విశేషం.

Next Story