మంగళగిరిలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌... క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన

by Vemula.Srinu Prasad |

మంగళగిరి టిడ్కో మెగా పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టాటా ఐపిఎల్ ఫ్యాన్ పార్క్‌కు క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది...

మంగళగిరిలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌... క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన
X

దిశ, మంగళగిరి: మంగళగిరి టిడ్కో మెగా పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టాటా ఐపిఎల్ ఫ్యాన్ పార్క్‌కు క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం తొలి రోజే భారీగా సందడి వాతావరణం నెలకొంది. పార్క్‌లో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్‌లపై ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో అభిమానులు స్టేడియం తరహా అనుభూతిని పొందుతున్నారు. మ్యాచ్‌లోని ప్రతి కీలక ఘట్టానికి ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తూ ఉత్సాహంగా వీక్షించారు. ఈ ఫ్యాన్ పార్క్ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవడం విశేషం.

ఆయన ప్రయత్నంతో మంగళగిరిలో ఈ తరహా భారీ క్రీడా వినోద కార్యక్రమం నిర్వహించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్క్ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండగా, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట స్థలాలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లలు గేమ్స్‌లో పాల్గొంటూ సందడిగా గడుపుతున్నారు.అదేవిధంగా, ఫుడ్ స్టాల్స్‌లో వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉండగా, మ్యూజిక్ ప్రోగ్రామ్‌లు ప్రేక్షకులను మరింత ఉత్సాహపరుస్తున్నాయి.

సాయంత్రం వేళల్లో ప్రేక్షకుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈరోజుతో పాటు రేపు కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కొనసాగనున్న నేపథ్యంలో మరింత మంది అభిమానులు హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా, టిడ్కో మెగా పార్క్‌లో జరుగుతున్న ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మంగళగిరి ప్రజలకు వినూత్న క్రీడా అనుభవాన్ని అందిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఈ కార్యక్రమం ఏర్పాటుకు చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్‌కు మంగళగిరి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Next Story