లులూ సంస్థను వైసీపీ ప్రభుత్వం తరిమేసింది : మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు

by Disha Web Desk 21 |
లులూ సంస్థను వైసీపీ ప్రభుత్వం తరిమేసింది : మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ నుంచి ప్రఖ్యాత లులూ సంస్థను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో లులూ సంస్థ విసిగిపోయిందని అన్నారు. మీకొక దండం... ఇక్కడ ఉండలేం అని చెప్పి లులూ సంస్థ తరలివెళ్లిపోయిందన్నారు. అసలు ఏపీలో పెట్టుబడులే పెట్టమని చెప్పేసిందని చెప్పుకొచ్చారు. వైసీపీ రివర్స్‌ పాలన వలన విశాఖలో 5 వేల మంది యువతకి ఉపాధిని దూరం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి తరిమేసిన ‘లులూ’ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఘన స్వాగతం పలికిందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గతేడాది లులూతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అతి పెద్ద మాల్‌ను ఘనంగా హైదరాబాద్‌లో ప్రారంభించుకుందని గంటా తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు సాధించలేదు. అప్పటికే వచ్చిన ప్రాజెక్టులను కాపాడుకోలేరు. వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే రివర్స్ పాలన స్టార్ట్ చేసింది ఫలితంగా‘లులూ’ను కూడా ‘రివర్స్‌’ బాట పట్టించింది అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏపీలో లులూ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేసి.. చివరకు పెట్టుబడులు సాధించారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2018లో విశాఖలో రూ. 2000 కోట్ల పెట్టుబడితో షాపింగ్‌మాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేలా ఎంవోయూ చేసుకొని, శంకుస్థాపన కూడా చేశారు అని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో బయపడి లులూ తరలివెళ్లిపోయిందన్నారు. దీంతో లులూకు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరచి ఘన స్వాగతం పలికాయని చెప్పుకొచ్చారు. ఏపీ నుంచి లులూ సంస్థ తరలిపోవడం వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. ఫలితంగా పొరుగు రాష్ట్రాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ దారుణాలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. విజన్‌కు ఉన్న విలువను, విధ్వంసం తెచ్చే వినాశనాన్ని తెలుసుకోవాలని సూచించారు. 2024లో మన రాష్ట్ర భవిష్యత్‌ను మీ ఓటు అనే ఆయుధంతో రక్షించండి అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed