తీవ్ర అల్పపీడనం.. రెడ్ అలర్ట్ జారీ.. వినాయక మండప నిర్వాహకులకు హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

తీవ్ర అల్పపీడనం.. రెడ్ అలర్ట్ జారీ.. వినాయక మండప నిర్వాహకులకు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రానున్న 24 గంటల్లో ఇది ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది.

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది. ఇప్పటికే ఏపీలోని ఉమ్మడి కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతుండగా.. తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సిద్ధిపేట, యాదాద్రి, జనగామ, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు 9 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Next Story