మరింత గట్టిగా ఏడవడానికి సిద్ధంగా ఉండు జగన్ : మంత్రి లోకేష్ ఘాటు రిప్లై

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మెగా డీఎస్సీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.

మరింత గట్టిగా ఏడవడానికి సిద్ధంగా ఉండు జగన్ : మంత్రి లోకేష్ ఘాటు రిప్లై
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మెగా డీఎస్సీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మెగా డీఎస్సీనా, దగా డీఎస్సీనా అని జగన్ సంధించిన ప్రశ్నలకు ఎక్స్ వేదికగా ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 వేల టీచర్ పోస్టుల్ని భర్తీ చేశామని, 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నారు. త్వరలోనే మరో డీఎస్సీని కూడా ఇవ్వనున్నామని, మరింత గట్టిగా ఏడవడానికి జగన్ సిద్ధంగా ఉండాలని మంత్రి లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడారు.

"మీరు టెన్త్ పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అంద‌రూ అలాగే ఉంటార‌నుకోవ‌డం చాలా పెద్ద నేరం. అత్యంత పార‌దర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చ‌దివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవ‌మానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచ‌ర్లు అంద‌రికీ జ‌గ‌న్ గారు లెంప‌లు వేసుకుని క్షమాప‌ణ‌లు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాల‌ని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా, యువ‌తకు ఉద్యోగాలు లేకుండా వారి భ‌విష్య‌త్తు నాశ‌నం చేయాల‌ని చూస్తున్న జ‌గ‌న్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజ‌లు ఎన్నటికీ క్షమించ‌రు." అని లోకేష్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.

Next Story