- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర బడ్జెట్ పై లోక్ సత్తా ఫౌండర్ కీలక వ్యాఖ్యలు
రాజకీయ ఆర్భాటాలు కాదు వాస్తవాల పునాదిపై సమాఖ్యవాదం నిలబడాలి.

దిశ, వెబ్ డెస్క్ : భారత సమాఖ్య వ్యవస్థలో (Federal System) నిధుల పంపిణీపై జరుగుతున్న చర్చలో వాస్తవాలను విస్మరించి కేవలం రాజకీయ భావోద్వేగాలకే ప్రాధాన్యత లభిస్తోందని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ (JP) ఆవేదన వ్యక్తం చేశారు. 2026-27 అంచనాల ప్రకారం, కేంద్రం తన మొత్తం రాబడిలో 51.7 శాతాన్ని (సుమారు రూ.26.2 లక్షల కోట్లు) పన్నుల వాటా, గ్రాంట్లు, వడ్డీ లేని రుణాల రూపంలో రాష్ట్రాలకు బదిలీ చేస్తోందన్నారు. కేంద్ర పన్నుల ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఈ వాటా ఏకంగా 59.6 శాతంగా ఉందన్నారు. రక్షణ, జాతీయ భద్రత, భారీ మౌలిక సదుపాయాలు, ఆహార-ఎరువుల సబ్సిడీల వంటి కీలక బాధ్యతలు కేంద్రంపై ఉన్న నేపథ్యంలో, రాష్ట్రాలకు ఈ స్థాయి బదిలీల తర్వాత కేంద్ర బడ్జెట్‌లో (Central Budget) నిర్మాణాత్మక లోటు ఏర్పడుతోందన్నారు. ఇకపై అదనపు బదిలీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యయాల గణాంకాలను విశ్లేషిస్తూ.. దేశానికి సంబంధించిన మొత్తం వ్యయంలో రాష్ట్రాలు 60 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హంగా పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ ఇతర సమాఖ్య దేశంలోనూ రాష్ట్రాలు ఇంతటి భారీ వాటాను ఖర్చు చేయడం లేదన్నారు. అయితే ప్రజాస్వామ్యానికి కీలకమైన స్థానిక సంస్థల వాటా కేవలం 3 శాతానికే పరిమితం కావడం అత్యంత విచారకరమని జెపి అభిప్రాయపడ్డారు. అధికారాలు, నిధులు అన్నీ రాష్ట్రాల వద్దే కేంద్రీకృతమయ్యాయి అన్నారు. స్థానిక ప్రభుత్వాలు ప్రపంచంలోనే అత్యంత బలహీనంగా ఉన్న దేశం మనదే అని ఆయన విమర్శించారు. తక్షణ ప్రయోజనాల కోసం, ఓట్ల రాజకీయాల కోసం చేసే ఉచితాల వ్యయం (Fiscal Profligacy) దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతుందన్నారు. ఉత్పాదక ఆస్తుల సృష్టి లేకుండా చేసే అప్పులు రాబోయే తరాలకు భారంగా మారుతాయని హెచ్చరించారు.
ముఖ్యంగా విద్యారంగంలో ఫలితాల లేమిపై ఆయన తీవ్రంగా స్పందించారు. అనేక రాష్ట్రాల్లో (States) ఒక్కో బిడ్డపై ఏడాదికి లక్ష రూపాయలకు పైగా వెచ్చిస్తున్నా 80 శాతం మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదని వివరించారు. వారు వృద్ధి రేటులో (Growth Rate) భాగస్వాములు కాలేకపోతున్నారని గుర్తు చేశారు. పాఠశాల విద్యలో ఫలితాలు, పట్టణ జీవన ప్రమాణాలు, చట్టబద్ధమైన పాలన, సుస్థిర సంక్షేమంపై దృష్టి పెట్టిన దేశాలే అభివృద్ధి చెందాయన్నారు. మనం కూడా అదే దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాలు తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల వంటి సామూహిక ప్రజా ప్రయోజనాలపై పెట్టుబడి పెట్టాలని సూచించారు. అప్పుడే సమతుల్య సమాఖ్యవాదం సాధ్యమవుతుందని జెపి స్పష్టం చేశారు.






